8 June, 2026 | 1:24 AM

రైతులను దగా చేసిన కేంద్ర ప్రభుత్వం

08-06-2026 12:03 AM
  1. వ్యవసాయాన్ని రైతుని దూరం చేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం 
  2. మద్దతు ధర జీవో మార్చేదాక ఉద్యమం 
  3. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 7 (విజయక్రాంతి):: కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను నామమాత్రంగా పెంచి రైతులను దగా చేసి, వ్యవసాయానికి రైతును దూరం చేయటానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పండుతుందని, ఈ జీవోని సవరించి రైతులకు మిగులు ఉండే విధంగా మార్చే వరకు ఐక్యంగా పోరాడుతామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం కొక్కెర పార్టీ పుల్లయ్య అధ్యక్షతన జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి కనీస మద్దతు ధరలను (MSP) నామమాత్రంగా పెంచుతున్న ట్లు ప్రకటించడం ద్వారా, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి భారతదేశ రైతులను మోసం చేసిందన్నారు .

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, పెట్రోల్, విద్యుత్, నీరు వంటి సాగు పెట్టుబడి ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన ఈ మద్దతు ధర పెంపు ఏమాత్రం సరితూగదన్నారు.   పశ్చిమ ఆసియా సంక్షోభ పరిస్థితిని సాకుగా చూపిస్తూ, ప్రభుత్వం తన ’పొదుపు చర్యల’ పిలుపు ద్వారా ప్రజలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతోందనీ తెలిపారు. ఎరువుల కొరత ఇప్పటికే మొదలైంది, దీనిని ఆసరాగా చేసుకుని అక్రమ నిల్వదారులు నల్లబజారులో భారీ లాభాలను ఆర్జిస్తున్నారు.

తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం కారణంగా రైతుల ఆత్మహత్యలు నిరాటంకంగా కొనసాగుతున్నాయన్నారు. ఈ సవాళ్లను ఐక్యంగా ఎదుర్కోవాలని, ధనిక అనుకూల విధానాలను ఓడించడానికి నిరంతరం పోరాడాలని  ఆయన రైతాంగానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవర సత్యనారాయణ ఉపాధ్యక్షులు ఎలమంచిలి రవికుమార్ కె ధర్మ కొండబోయిన వెంకటేశ్వర్లు బుల్లి సత్యనారాయణ మోరంపూడి శ్రీనివాసరావు ఈ సీసం రాంబాబు గణేషు మూర్తి బచ్చలకూర శ్రీనివాస్ శంకరన్న లక్ష్మీనరసయ్య శ్రీదేవి సమ్మక్క పుల్లయ్య బొల్లం రాజు తదితరులు పాల్గొన్నారు.