రైతు మృతిచెందడం బాధాకరం
ఎమ్మెల్యే వేముల వీరేశం
కుటుంబానికి రూ.2 లక్షల ప్రభుత్వ సహాయం, రూ.50 వేల వ్యక్తిగత ఆర్థిక సాయం
చిట్యాల, జూన్ 7: కోహెడలో నిర్వహించిన ముఖ్యమంత్రి సభకు హాజరై తిరుగు ప్రయాణంలో గుండెపోటుతో రైతు పప్పుల ఎల్లయ్య మృతి చెందడం అత్యంత బాధాకరమని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. మండలంలోని వట్టిమర్తి గ్రామంలో రైతు పప్పుల ఎల్లయ్య పార్థివ దేహానికి ఆదివారం పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున మృతుడి కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేశారు. అలాగే మానవతా దృక్పథంతో తన వ్యక్తిగత సహాయంగా రూ.50 వేల నగదు అందించి కుటుంబానికి అండగా నిలిచారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎల్లయ్య కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని, కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈయన వెంట సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కాటం వెంకటేశం, గుడిపాటి లక్ష్మీ నరసింహ, బట్టు ఐలేష్, నర్రా మోహన్ రెడ్డి, తహసిల్దార్ విజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఉన్నారు.






