3 April, 2026 | 3:16 AM

తెలంగాణపై కేంద్రం చిన్న చూపు

03-04-2026 12:00 AM

మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్

మహబూబాబాద్, ఏప్రిల్ 2(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని, బీజేపీ పాలిత రాష్ట్రాలతో సమానంగా ఇతర రాష్ట్రాలకు నిధుల కేటాయింపు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలులో వివక్ష చూపుతోందని మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ పార్లమెంటులో విమర్శలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని స్థాపించబడిన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కు సంబంధించిన అత్యంత ముఖ్యమైన, ప్రజాప్రయోజనానికి సంబంధించిన విషయాన్ని లోక్ సభలో ఎంపీ ప్రస్తావించారు.

రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ 2021వ సంవత్సరంలో ఉత్పత్తిని ప్రారంభించిందని, ఈ ప్లాంటుకు నిర్ణీత లక్ష్యం 12.7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అయితే, ప్లాంటు ప్రారంభమైన నాలుగు సంవత్సరాలు గడిచినా, ఇప్పటి వరకు పూర్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించలేదన్న వాస్తవం అత్యంత ఆందోళనకరంగా ఉందన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందించాలనే ముఖ్య లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన ఈ సంస్థ తన నిర్ణీత లక్ష్యాన్ని చేరుకోలేకపోవడం, జాతీయ వ్యవసాయ రంగానికి జరిగిన నష్టమే కాక, తెలంగాణ రైతాంగానికి చేయబడిన ద్రోహంగా పేర్కొన్నారు.

అయిదు సంవత్సరాలలో ఈ ప్లాంటులో సుమారు 60 సార్లు షట్డౌన్లు జరిగినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయని, అంటే సగటున ప్రతి సంవత్సరం 12కి పైగా సార్లు ఉత్పత్తి నిలిపివేయబడిందన్నారు. అత్యంత దురదృష్టకర విషయమేమిటంటే, ఆర్ ఎఫ్ సీ ఎల్ ఒక్క ఉత్పత్తి యూనిట్ మాత్రమే ఉన్న సంస్థ అయినప్పటికీ, దాని కార్పొరేట్ కార్యాలయం ప్లాంటు స్థలం నుండి వందల కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ లోని నోయిడా నగరంలో ఉండటం వల్ల, సంస్థ యొక్క అన్ని అగ్ర అధికారులు, నిర్ణయాధికారులు, ఉన్నత యాజమాన్యం నోయిడా నుండి పరిపాలనను నిర్వహించడం వల్ల, ప్లాంటు యొక్క వాస్తవ కార్యకలాపాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ కొరవడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్ ఎఫ్ సి ఎల్ సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని, నిర్వహణ ఇక్కడ నుంచే జరిగేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.