calender_icon.png 21 January, 2026 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ శక్తుల సవాళ్లు

21-01-2026 12:00:00 AM

  1. కార్పొరేట్ల చేతిలో బంధీగా కేంద్ర ప్రభుత్వం 
  2. సీపీఐ జాతీయ సెమినార్‌లో డిప్యూటీ సిఎం భట్టి 

ఖమ్మం, జనవరి 20 (విజయక్రాంతి): ప్రజాస్వామ్యానికి కార్పొరేట్ శక్తులు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయని, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల చేతిలో బంధీగా మారిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. మతాన్ని అడ్డుపెట్టుకుని లబ్ధి పొందేందుకు కార్పొరేట్, ఫాసిస్టు శక్తులు ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. మంగళవారం ఖమ్మంలో సీపీఐ ఆధ్వర్యంలో జరిగిన నేటి భారతదేశం వామపక్షాలు ఎదుర్కొంటున్న సవాళ్లు అనే అంశంపై  సెమినార్లో భట్టి మాట్లాడుతూ..

పార్లమెంటు ప్రజాస్వామ్యాన్ని బిజెపి నేతృత్వంలోని మతతత్వ శక్తులు నిర్వీర్యం చేస్తున్నాయని, ఆర్థిక సామాజిక అంశాలను పక్కదారి పట్టిస్తున్నాయన్నారు. లౌకిక ప్రజాతంత్ర శక్తుల ఐక్యతతోనే మతతత్వ శక్తులను అడ్డుకోగలమని స్పష్టం చేశారు. దేశంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా వామపక్షాలు ఐక్యంగా కదలాలని మార్క్స్ చెప్పినట్లుగా వర్గ పోరాటాల ద్వారానే సమసమాజం నిర్మితమవుతుందని తెలిపారు. వందేళ్ల సిపిఐ చరిత్రలో ఎన్నో ఆటుపొట్లు ఉన్నాయని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం సాధించడంలో సిపిఐ ప్రముఖ భూమిక పోషించిందని తెలిపారు.

1947లో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్య్రం రాలేదని ఇక్కడి నిజాం రాజును కూల్చడానికి కమ్యూనిస్టులు సాయుధ పోరాటం చేశారని ఆ పోరాటం ప్రపంచ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగానే కాంగ్రెస్ పార్టీ కౌలుదారి చట్టాన్ని, భూ -సంస్కరణ చట్టాన్ని, 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని, బ్యాంకుల జాతీయ కరణతో పాటు ఇటీవల కాలంలో సమాచార హక్కు చట్టం, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా కాంగ్రెస్ తీసుకు వచ్చిందన్నారు.

రాజ్యాంగ పరిరక్షణ ప్రజాస్వామ్య రక్షణ కర్తవ్యాలుగా వామపక్షాలు ఇతర లౌకిక శక్తులు కలిసి పనిచేయాలన్నారు. ఇప్పటికే హక్కులు హరించబడుతున్నాయని ఓటు హక్కు సైతం ప్రమాదంలో పడిందని ఆయన తెలిపారు. ఈ దేశంలో కాంగ్రెస్, వామపక్షాలు కలిసి సుదీర్ఘకాలం పయనించాల్సిన అవసరం ఉందని ఆ దిశగా కార్యాచరణ చేపట్టాలని విక్రమార్క తెలిపారు. ఈ సందర్భంగా వందేళ్ల సిపిఐ సిడిని భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.