26 July, 2026 | 2:15 AM

చికుబుకు రైలు బండి ఇక మల్లన్న చెంత ఆగేనండి

26-07-2026 12:00 AM
  1. నేడు ప్రారంభించనున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  2. 6 కోట్లతో నిర్మాణం, ప్రారంభానికి సర్వం సిద్ధం
  3. అమృత్ భారత్‌లో చేరిస్తే మరిన్ని సౌకర్యాలు

కొమురవెల్లి, (విజయక్రాంతి): సిద్ధ్దిపేట జిల్లా కొమురవెల్లి భక్తులకు ఇక రైలు ప్రయాణం అందుబాటులోకి రానుంది. పనులు పూర్తయి ఏడాది కాలం గా ఎదురుచూస్తున్న భక్తుల కల నేడు నేరవేరబోతుంది. భక్తుల చిరకాల ఆకాంక్ష అయినా కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ నేడు ప్రారంభం కానున్నది. ప్రతి సంవత్సరం మల్లన్న బ్రహ్మోత్సవాలు సం దర్భంగా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి తరలి వస్తుంటారు.

ఇప్పటిదాకా రోడ్డు మార్గంపైనే ఆధారపడవలసి వచ్చిన భక్తులకు కొమరవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణం మరింత సులభం కానుంది. మరీ ముఖ్యంగా జంట నగరాల నుంచి వచ్చే భక్తులతో పాటు స్థానికులకు రైలు ప్రయాణం సౌలభ్యంగా మారనున్నది. భక్తులకు రవాణా ఖర్చు లు తగ్గడంతో పాటు మెరుగైన రవాణా సౌకర్యం లభించనున్నది. కొమురవెల్లి పరిసర ప్రాంతాల ప్రజలు, చిరు వ్యాపారులు విద్యార్థులు తక్కువ ఖర్చుతో హైదరాబాద్ వెళ్లడానికి మార్గం సుగమమైంది.

పచ్చ జెండా ఊపనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..

సుమారు రూ.6 ఆరు కోట్లతో నిర్మించిన కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్ర హోం శాఖ సహయమంత్రి బండి సంజయ్‌తో కలిసి నేటి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించి, సిద్ధ్దిపేట నుంచి సికింద్రాబాద్ వెళ్లే డెమో రైలుకు పచ్చ జెండా ఊపి ప్రారంభిస్తారు. రైల్వే స్టేషన్ ప్రారంభానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు.

ప్రాజెక్టు పూర్తయితేనే భక్తులకు మేలు..

మనోహరాబాద్ నుంచి కొత్త పల్లి వరకు రైల్వే లైన్ పూర్తయితేనే మల్లన్న భక్తులకు మరింత ప్రయాణం సౌకర్యవంతంగా మారుతుంది. ఇప్పటివరకు సికింద్రాబాద్ నుంచి సిద్ధిపేట వరకే ప్రయాణికులకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంది. సిద్ధ్దిపేట నుంచి సిరిసిల్ల వరకు ఇంకా పనులు కొనసాగుతున్నాయి. సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి వరకు పనులు పూర్తయితే భక్తులకు తక్కువ ఖర్చుతో సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.

మహారాష్ట్ర, అదిలాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, కోరుట్ల వైపు నుంచి వచ్చే భక్తులలో కొంతమంది భక్తు లు ముందుగా వేములవాడ రాజరాజేశ్వరి స్వామిని దర్శనం చేసుకు ని, అనంతరం మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు. అదేవిధంగా జంట నగరాల వైపు నుంచి వచ్చే భక్తులు మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకొని, తర్వాత వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శ నం చేసుకుంటారు. వీరంతా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి అధిక మొత్తంలో కిరాయిలు చెల్లించి దర్శనానికి వస్తుంటారు.

దీంతో పేద మధ్యతరగతి భక్తులకు ప్రయాణకు ఖర్చులు మోయలేని భారంగా పరిణమించాయి. సామాన్య, మధ్యతరగతి భక్తుల ప్రయాణ ఆర్థిక భారాన్నిదృష్టిలో ఉంచుకొని పనులు శరవేగంగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు దృష్టి సారించి త్వరితగతిన పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వే స్టేషన్ అమృత్ భారత్‌లో చేర్చాలని భక్తులు స్థానికులు అభిప్రాయపడుతున్నారు.