26 July, 2026 | 2:17 AM

కృష్ణపట్టెలో ఆదిమానవుని ఆనవాళ్లు

26-07-2026 12:00 AM
  1. వాడపల్లి, ఇరికిగూడెం, కొత్తపల్లిలో ఆధారాలు
  2. తెలంగాణ కొత్త చరిత్ర బృందం పరిశోధనల్లో వెలుగులోకి..
  3. మట్టి పాత్రలు, సమాధులు, గుహలే సాక్ష్యం

బి.నకిరేకంటి గోవర్ధన్, దామరచర్ల, నల్లగొండ జిల్లా (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని కృష్ణప ట్టె ప్రాంతం ఆదిమానవుల జీవనానికి కేంద్రంగా ఉన్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది. వాడపల్లి, ఇరికిగూ డెం, కొత్తపల్లి గ్రామాల పరిసరాల్లో తెలంగాణ కొత్త చరిత్ర బృందం నిర్వహించిన పరిశోధనల్లో లభ్యమైన ఆధారాలు ఈ ప్రాంతంలో ఆదిమానవులు నివసించినట్లు సూచిస్తున్నాయి. కృష్ణా, మూసీ నదుల పరీవాహక ప్రాంతాల్లో గుహ లు, మట్టి పాత్రల అవశేషాలు, సమాధులు, ఇటుకలతో కూడిన నిర్మాణాల ఆనవాళ్లు బయటపడటం విశేషం.

కృష్ణా, మూసీ తీరాల్లో జీవనం

వాడపల్లి గ్రామ శివారులోని మూసీ ఒడ్డున ఆదిమానవులు నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవించినట్లు ఆధారాలు లభించాయి. ఇప్పటికీ అక్కడక్కడ కనిపించే గుహలు వారి నివాసాలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాగే కృష్ణానది ఒడ్డున ఉన్న ఇరికిగూడెం గ్రామ పరిసరాల్లో కూడా ఆదిమానవుల నివాసాలకు సంబంధించిన ఆనవాళ్లను పరిశోధకులు గుర్తించారు. ఈ ప్రాంతం వేల ఏళ్లు గా మానవ నివాసాలకు అనుకూలంగా ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు.

ఈ ప్రాంతం లో గతంలోనే వెయ్యి నుంచి రెండు వేల ఏళ్ల నాటి నాగరికతకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం కృష్ణానదిని ఆధారంగా చేసుకుని ఈ ప్రాంతం ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చెందిందని చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఆ కాలంలో నదీమార్గం ద్వారా బంగారం, వజ్రాలు, వెండి, సీసం, నూలు తదితర వస్తువుల ఎగుమతి, దిగుమతులు జరిగేవని చరిత్రకారులు పేర్కొంటున్నారు.

మట్టి పాత్రలు, స్పటిక ఆభరణాలు..

ఆ కాలంలో వినియోగించిన ఎర్ర, నల్ల మట్టి పాత్రల అవశేషాలు ఈ ప్రాంతంలో విసృతంగా లభిస్తున్నాయి. దీంతో అప్పట్లో మట్టి పాత్రల వినియోగం ఎక్కువగా ఉండేదని స్పష్టమవుతోంది. అలాగే స్పటికంతో తయారు చేసిన ఆభరణాల ఆనవాళ్లు కూడా లభించడం విశేషం. ఇవి అప్పటి ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అదే విధంగా ఎర్ర ఇటుకలతో నిర్మించిన గహల ఆనవాళ్లు, చతురస్రాకార సమాధులను ఈ ప్రాంతంలో  కొత్త చరిత్ర పరిశోధకుల బృందం గుర్తించింది.

ఎగుమతులకు ఇష్టమైన వస్తువులను సమాధుల్లో ఉంచే ఆనవాయితీ అప్పటినుంచే ఉన్నట్లు ఆధారాలు తెలియజేస్తున్నాయి. రాక్షస దిబ్బల ఆనవాళ్లతో పాటు తొలి నాగరిక యుగం, హిందూ నాగరికతకు సంబంధించిన చిహ్నాలు కూడా కనిపించడం ఈ ప్రాంత చారిత్రక ప్రాధాన్యాన్ని మరింత పెంచుతోంది.

తవ్వకాలు చేపడితే మరిన్ని ఆధారాలు..

ఇరికిగూడెం, కొత్తపల్లి, వాడపల్లి ప్రాంతాల్లో శాస్త్రీయ తవ్వకాలు చేపడితే ప్రాచీన నాగరికతకు సంబంధించిన మరిన్ని విలువైన ఆధారాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో పురావస్తు శాఖ నిర్వహించిన ప్రాథమిక పరిశీలనల్లోనే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

కొత్త చరిత్ర బృందం పరిశోధకులు తాజాగా నిర్వహించిన పరిశోధనల్లో గుహలు, మట్టి పాత్రల అవశేషాలు, సమాధులు, ఇటుకల నిర్మాణాల ఆనవాళ్లు బయటపడటం ఆశ్చర్యంగా ఉంది. మా ప్రాంతానికి ఇంత ఘనమైన చరిత్ర ఉండటం గొప్ప విషయం. తవ్వకా లు చేపడితే మరిన్ని ఆధారాలు లభ్యమయ్యే అవకాశముంది.