సీఎం సొల్లు కబుర్లు చెబుతున్నారు
పాలమూరుకు ఆయన ఏం చేశారో చెప్పాలి
బీజేపీ అభ్యర్థి డీకే అరుణ
మహబూబ్‌నగర్, మే 6 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఏం చేశారో.. ఏం చేయాలనుకుంటున్నారో చెప్పాల్సింది పోయి సొల్లు కబుర్లు చెబుతున్నారని, ఇలాంటి వాటి వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదని మహబూబ్‌నగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విమర్శించారు. సోమవారం తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 10న ప్రధాని మోదీ నారాయణపేటకు రానున్నారని, పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలకాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారం రాష్ట్రంలో మహిళలు తలదించుకునేలా ఉందని, ఇది సరికాదని హితవు పలికారు.
జీఓ నంబర్ 46ను రద్దు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి నేటికీ దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇప్పటివరకు పాలమూరుకు ఏం చేశారో చెప్పాలని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకురావడమే కాకుండా అవసరమైన నిధులు వచ్చేలా శాయశక్తులుగా కృషి చేస్తామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ పక్కాగా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరులో తన గెలుపునకు ప్రతి ఒక్కరూ సమకరించాలని కోరారు. సమావేశంలో బీజేపీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, రాములు, పద్మాజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




