24 February, 2026 | 4:39 PM

సీఎం వెంటనే స్పందించాలి

24-02-2026 12:53 AM

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కుమ్మెర గ్రామంలో రెండు నెలల పసిబిడ్డ మృతిచెందిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించాలని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ధర్నా శిబిరం వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉందని, నిందితులపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంతో పాటు హత్య కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

ఎస్పీ, కలెక్టర్ గ్రామాన్ని సందర్శించి బాధితులకు భరోసా కల్పించాలని, ఘటనపై మౌనం వహించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు స్పందించాలని కోరారు. ఫిర్యాదులో ఎనిమిది మందిపై పేర్లు ఉన్నప్పటికీ నలుగురినే అరెస్టు చేయడం పోలీసుల నిర్లక్ష్యాన్ని సూచిస్తోందని విమర్శించారు. నిందితులను పూర్తిగా అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని జాన్ వెస్లీ హెచ్చరించారు.