30 May, 2026 | 6:49 PM

అశ్వారావుపేటలో జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృత పర్యటన

30-05-2026 06:18 PM

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాలు వేగవంతం చేయాలి

జూన్ 2 నాటికి ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశాలకు సిద్ధం చేయాలి - జిల్లా కలెక్టర్ అంకిత్

అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అశ్వారావుపేటలో శనివాయ్ విస్తృతంగా పర్యటించారు.  ఈ పర్యటనలో భాగంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులు, తహసీల్దార్ కార్యాలయం నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి పనుల నాణ్యత, పురోగతి, భవనాల నమూనా మ్యాపులను పరిశీలించారు. విద్యార్థులకు భవిష్యత్తులో అత్యుత్తమ విద్యా వాతావరణం కల్పించేలా అన్ని ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

పాఠశాల ప్రాంగణానికి అనుసంధాన రహదారులు, అంతర్గత రోడ్లు, విద్యుత్ సరఫరా, తాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లల ఉజ్వల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలను నిర్మిస్తోందన్నారు. ప్రపంచ స్థాయి విద్యను అందించి విద్యార్థులను భవిష్యత్ సవాళ్లకు సిద్ధం చేసే లక్ష్యంతో ఈ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐదు యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, నిర్ణీత గడువులోగా నాణ్యతతో పనులు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నాటికి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూ భారతి, సాదా బైనామా, భూ సర్వేలకు సంబంధించిన దరఖాస్తులు, వాటి పరిష్కార పురోగతిని తహసీల్దార్ కిషోర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత సమయంలో పరిష్కరించి సకాలంలో సేవలు అందించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి వేగవంతంగా పరిష్కరించాలని సూచించారు. అలాగే అశ్వారావుపేట మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించే ప్రక్రియలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా కొనుగోలు కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి రైతులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ప్రజలతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలు, ఫిర్యాదులను తెలుసుకున్నారు. ప్రజల వినతులను సానుకూలంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి నిర్మాణాల పురోగతి, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అశ్వారావుపేట మండలంలో మొత్తం 957 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, వాటిలో 926 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అధికారులు వివరించారు.

వీటిలో 123 ఇండ్లు బేస్ లెవల్‌లో, 189 ఇండ్లు రూఫ్ లెవల్‌లో, 403 ఇండ్లలో స్లాబ్ పనులు పూర్తికాగా, 200 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, ఇంకా 31 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభం కాలేదని తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో 136 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా, 129 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభమై, 52 ఇండ్లు పూర్తయ్యాయని అధికారులు కలెక్టర్‌ అంకిత్ కు వివరించారు. పూర్తయిన, చివరి దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను జూన్ 2వ తేదీన గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇంకా నిర్మాణాలు ప్రారంభం కాని ఇండ్లను వెంటనే గ్రౌండింగ్ చేసి పనులు ప్రారంభించాలని సూచించారు. లబ్ధిదారులకు అవసరమైన సాంకేతిక, పరిపాలనా సహకారం అందిస్తూ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని విజయవంతం చేయడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ సూచించారు. అలాగే ప్రభుత్వం చేపడుతున్న విద్యా, గృహ నిర్మాణ, రెవెన్యూ సేవల కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో లో తహసీల్దార్ కిషోర్, మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి, హౌసింగ్ ఏఈ మదన్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.