19 July, 2026 | 2:14 AM

కూలిన భవననిర్మాణ కార్మిక చట్టం

19-07-2026 12:00 AM

తీన్మార్ మల్లన్న :

ఆకాశహర్మ్యాలను నిర్మిస్తూ, మహానగరాలకు అందాలు అద్దే భవన నిర్మాణ కార్మికుల చెమట, రక్తం సాక్షిగా నేను ప్రశ్నిస్తున్నాను. రాత్రీపగలు కష్టపడి కూలీ పనులు చేసుకునే పేద జీవుల కడుపు కొట్టి, వారి సంక్షేమం కోసం ఉద్దేశించిన వేల కోట్ల రూపాయల నిధులను లూటీ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కార్మికుల సంక్షేమ చట్టాలను నీరుగారుస్తూ, అక్రమార్కులకు కొమ్ముకాస్తున్న పాలకులారా... మీ నిర్లక్ష్యం పేదలను ఏ విధంగా రోడ్డున పడేసిందో కాగ్ ఆడిట్ నివేదిక సాక్షిగా లెక్కలతో సహా నిలదీస్తున్నాను.

1.చట్టాన్ని ఏ విధంగా నీరుగార్చారు?

పేద కార్మికుల రక్షణ కోసం రూపొందించిన భవన, ఇతర నిర్మాణ కార్మికుల (ఉపాధి క్రమబద్ధీకరణ, సేవల నిబంధనల) చట్టం, 1996 మన రాష్ట్రంలో పాలకుల స్వార్థానికి బలైంది. నిబంధనల ప్రకారం కార్మికుల సంక్షేమ బోర్డులో చైర్మన్‌తో కలిపి కనీసం ఎనిమిది మంది సభ్యులు ఉండాలి. అందులో కార్మికుల ప్రతినిధులు, యజమానులు ఉండాలి. కానీ, తెలంగాణలో అక్టోబ ర్ 2018 తర్వాత బోర్డు గడువు ముగిసినప్పటికీ, ముగ్గురు ప్రభుత్వ అధికారులతోనే (ఎక్స్‌అఫిషియో మెంబర్లు) బోర్డును నడిపిస్తూ చట్టాన్ని పూర్తిగా అపహాస్యం చేశారు. 

ఘోరమైన తనిఖీల వైఫల్యం: నిర్మాణ స్థలాల్లో కార్మికుల భద్రత, ఆరోగ్య ప్రమాణాలు పర్యవేక్షించాల్సిన లేబర్ అధికారులు నిద్రపోతున్నారు. 2017--22 మధ్యకాలంలో ప్రమాదకరమైన సంస్థల తనిఖీలకు గానూ కమిషనర్ నిర్దేశించిన 14,530 సంస్థలలో అధికారులు 432 తనిఖీలు (3 శాతం) మాత్రమే చేశారు. ఆడిట్ చేసిన ఐదు జిల్లాల్లో 89,489 భవన ప్లాన్లు మున్సిపాలిటీల ద్వారా ఆమోదం పొందితే, లేబర్ విభాగంలో 2,394 సంస్థలే బోర్డు కింద రిజిస్టర్ అయ్యాయి. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడిచినా, చట్టం ప్రకారం ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర సలహా కమిటీని ఇంతవరకు ఏర్పాటు చేయలేదు.

2. ప్రైవేటు సంస్థల దోపిడీ: చట్టం ప్రకారం ప్రతి నిర్మాణ వ్యయం నుంచి 1 శాతం లేబర్ సెస్ వసూలు చేసి పేద కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలి. లేబర్ డిపార్ట్‌మెంట్ విజిలెన్స్ అలర్ట్ నోట్స్ ప్రకారం 452 సంస్థల నుంచి రూ.410.99 కోట్ల సెస్సు వసూలు చేయాల్సి ఉండగా, రూ.99.67 కోట్లు మాత్రమే వసూలు చేశారు. మిగిలిన రూ.311.32 కోట్ల (76 శాతం) ప్రజాధనాన్ని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ శక్తులు ఎగ్గొట్టి దర్జాగా తిరుగుతున్నాయి.

ఈ మోసాలకు పాల్పడ్డ ప్రధాన రియల్ ఎస్టేట్ సంస్థలు, వాటి బకాయిల లెక్కలు ఇవిగో. లక్ష్మి ఇన్‌ఫోబాన్ ఎల్‌ఎల్‌పీ నుంచి రూ.4.99 కోట్లు సెస్ వసూలు చేయాల్సి ఉండగా, రూ.39.56 లక్షలు వసూలైంది. బీఎస్‌ఆర్ బిల్డర్స్ నుంచి వసూలు చేయాల్సింది రూ.2.26 కోట్లు కాగా, చెల్లించింది రూ.46.86 లక్షలే. ట్రెండ్‌సెట్ బిల్డర్స్/ జయభేరి ఎలివేట్ నుంచి వసూలు చేయాల్సింది రూ.2.02 కోట్లు కాగా, చెల్లించింది రూ.12 లక్షలే.

అపర్ణ కన్‌స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్‌కు చెందిన అపర్ణ కనోపి లోటస్ గుండ్లపోచంపల్లి ప్రాజెక్టు కింద రూ.1.60 కోట్లు రావాల్సి ఉండగా, రూ.5 లక్షలే వసూలు చేశారు. అపర్ణ ఇన్‌ఫ్రా హౌసింగ్ నుంచి రూ.1.84 కోట్లు బకాయి ఉంది. బంజారాహిల్స్ ప్రాజెక్ట్ నుంచి రూ.86.80 లక్షలు బకాయి ఉంది. జూబ్లీహిల్స్‌లో బీ పార్థసారథి రెడ్డికి చెందిన సాయి సింధు ఫౌండేషన్స్ సంస్థ నుంచి ఒక్క రూపాయి వసూలు చేయలేదు. వీరి పెండింగ్ సెస్ వ్యయం రూ.1.18 కోట్లు.

ఎస్‌ఎంఆర్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక ప్రాజెక్టు బకాయిలు రూ.1.17 కోట్లు కాగా, మరో మూడు ప్రాజెక్టుల బకాయిలు రూ.1.01 కోటి, రూ.94.38 లక్షలు, రూ.50.44 లక్షలు. దేవభూమి రియల్టర్స్ రెండు వేర్వేరు ప్రాజెక్టుల నుంచి రావాల్సిన రూ.70.41 లక్షలు, రూ.22.52 లక్షల సెస్ వసూలు చేయలేదు.

అంతేకాదు, సెల్లార్, స్టిల్ట్ స్థలాలపై తక్కువ వసూలు చేశారు. రఘురామ్ అండ్ ఇతరులు, డీపీకే కన్‌స్ట్రక్షన్స్, ఆర్పీఎల్ బిల్డర్స్ వంటి 14 కేసుల్లో బిల్డింగ్ ఏరియా ప్లాన్ ఆమోద రేట్ల కంటే తక్కువ రేట్లకు లెక్కించడం వల్ల రూ.12.84 లక్షల సెస్ తక్కువగా వసూలు చేశారు.

3. ప్రభుత్వ విభాగాలు, మున్సిపాలిటీల బాగోతం: ప్రైవేట్ సంస్థల దోపిడీ ఇలా ఉంటే.. మరోవైపు పేద కూలీల సొమ్మును ప్రభుత్వమే దారిమళ్లించింది. ఆడిట్ చేసిన మున్సిపాలిటీలు వసూలు చేసిన రూ.164.25 కోట్ల సెస్సులో రూ.59.86 కోట్లు మాత్రమే బోర్డుకు జమచేశాయి. మిగిలిన రూ.104.39 కోట్లను (64 శాతం) తమ అవసరాలకు వాడుకున్నాయి. ఇందులో ఒక్క జీహెచ్‌ఎంసీ వద్దే నిలిచిపోయిన నిధులు రూ.88.82 కోట్లు. 

కొవిడ్ నిధుల మళ్లింపు: కొవిడ్ సమయంలో తెల్ల రేషన్‌కార్డుదారులకు సహా యం అందించడానికి ప్రభుత్వం బోర్డుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ.1004.82 కోట్లు అడ్వాన్స్‌గా బదిలీ చేయించింది. అందులో రూ.258.04 కోట్లు మాత్రమే రిజిస్టర్డ్ నిర్మాణ కార్మికులకు ఖర్చుచేశారు. మిగిలిన రూ.746.78 కోట్లు సంక్షేమ బోర్డుకు నేటికీ తిరిగి రాలేదు.

నిషేధించినా ప్రకటనలపై ఖర్చు: నిర్మాణ సెస్ నిధులను ఎలాంటి ప్రచారాలకు ఖర్చు చేయకూడదని సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ప్రచారం కోసం కార్మికుల సొమ్ము నుంచి రూ.32.43 కోట్లను బోర్డు ప్రకటనల కోసం ఖర్చు చేసింది. భవన నిర్మాణ కార్మికులకు సంబంధం లేని ఇతర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలకు బోర్డు నుంచి రూ.40.07 కోట్లు దారిమళ్లించగా, అందులో రూ.24.57 కోట్లు ప్రభుత్వం నుంచి ఇంకా తిరిగి బోర్డుకు రీయింబర్స్ కాలేదు.

బోర్డు బ్యాంకు నిల్వలను సమన్వయం చేసుకోకపోవడం వల్ల గడువు ముగిసిన లేదా బౌన్స్ అయిన 339 చెక్కుల ద్వారా బోర్డు రూ.51.47 కోట్ల రాబడిని నష్టపోయింది. రాష్ట్రాన్ని విభజించి పన్నెడేళ్లు గడుస్తున్నా ఏపీ బోర్డు నుంచి రావాల్సిన రూ.431.94 కోట్ల వాటాను తెలంగాణ బోర్డు వసూలు చేయడంలో విఫలమైంది. పీడీ ఖాతాలో రూ.119.39 కోట్లు విడుదల చేయకుండా నిలిపివేశారు.

4. పేద కార్మికులకు అన్యాయం: ఈ నిధులన్నీ అక్రమార్కుల పాలుకావడం వల్ల క్షేత్రస్థాయిలో నిజమైన కూలీ రోడ్డున పడ్డాడు. బోర్డుకు అందిన మొత్తం 1,38,908 క్లెయిమ్‌లలో 83,736 మాత్రమే పరిష్కరించి, మిగిలిన 45,047 క్లెయిమ్‌లను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టారు. నిబంధనల ప్రకారం 14 రోజుల్లోపు క్లెయిమ్ మొత్తం కార్మికుడికి అందాలి. కానీ, 4 శాతం (2,740 క్లెయిమ్‌లు) మాత్రమే నిర్ణీత సమయంలో మంజూరయ్యాయి.

50 శాతం క్లెయిమ్‌లు మంజూరు కావడానికి 1 నుంచి 6 నెలలు పడితే, మరో 46 శాతం క్లెయిమ్‌ల మంజూరుకు 6 నెలల నుంచి ఏడాదికిపైగా జాప్యం జరిగింది. కాగ్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి 154 మంది అసలైన కూలీలతో మాట్లాడితే, అందులో ఒక్కరూ ఈ చట్టం కింద రిజిస్టర్ కాకపోవడం అతిపెద్ద దారుణం! బోర్డు మీటింగ్‌లలో ఆమోదించి బడ్జెట్ కేటాయించినప్పటికీ, కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయలేదు.

జయశంకర్ విద్యా ఆర్థిక సహాయ పథకానికి రూ.15 కోట్లు, లైఫ్ డిస్‌ఎబిలిటీ పెన్షన్‌కు రూ.10 లక్షలు కేటాయించినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. ఆధార్ కార్డ్ సమన్వయం లేకపోవడం వల్ల వేర్వేరు రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రమాద మరణాలు, ప్రసూతి సహాయం కింద డబుల్ క్లెయిమ్‌ల పేరిట లక్షల రూపాయలు అక్రమంగా దారిమళ్లించారు. ఉదాహరణకు 29 మంది లబ్ధిదారులకు డబుల్ మెటర్నిటీ బెనిఫిట్స్ చెల్లించడం వల్ల రూ.8.60 లక్షల నష్టం జరిగింది.

5. ఈ చట్టాన్ని బాగుచేయడమెలా?: ఈ దోపిడీని అడ్డుకుని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించడానికి ఈ కింది చర్యలు తక్షణమే చేపట్టాలని నేను డిమాండ్ చేస్తున్నాను. సెస్ బకాయిలు పెట్టిన ప్రైవేట్ నిర్మాణ కంపెనీల నుంచి రూ.311.32 కోట్ల బకాయిలను రికవరీ చేయాలి. ముగ్గురు అధికారుల దందాను ఆపి, కనీసం 8 మంది సభ్యులతో కూడిన నూతన బోర్డును తక్షణమే ఏర్పాటు చేసి, అందులో గుర్తింపు పొందిన కార్మిక సంఘాల ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించాలి.

జీహెచ్‌ఎంసీ వద్ద నిలిచిపోయిన రూ.88.82 కోట్ల లేబర్ సెస్ నిధులను వడ్డీతో సహా సంక్షేమ బోర్డు ఖాతాలో జమచేయాలి. అడ్వాన్స్ పేరిట ప్రభుత్వం లాక్కున్న రూ.746.78 కోట్ల సంక్షేమ నిధులను వెంటనే బోర్డుకు ఇచ్చేయాలి. రూ.51.47 కోట్ల బౌన్స్ అయిన 339 చెక్కులకు సంబంధించి సంబంధిత బిల్డర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. 14 రోజులలోపు క్లెయిమ్ దరఖాస్తును పరిశీలించి లబ్ధిదారుడికి బ్యాంకు ఖాతాలో నేరుగా నగదు జమచేయాలి. ఆధార్ లింకేజీని కఠినతరం చేసి డబుల్ రిజిస్ట్రేషన్లను పూర్తిగా రద్దు చేయాలి.

పేదల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్న పాలకుల్లారా.. పేదల చెమట చుక్కలు కోటలను కూడా కూల్చగలవని గుర్తుంచుకోండి. ఈ దోపిడీపై తీన్మార్ మల్లన్నగా నేను కార్మికుల పక్షాన నిలబడి అసెంబ్లీ నుంచి వీధుల వరకు పోరాటం సాగిస్తానని హెచ్చరిస్తున్నాను.

 వ్యాసకర్త: టీఆర్పీ అధ్యక్షుడు