19 July, 2026 | 2:14 AM

ఇథనాల్‌పై విజయం!

19-07-2026 12:00 AM

ఇథనాల్ బ్లెండింగ్‌పై దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా అనేక అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి. వాహనాల మైలేజీ తగ్గిపో తున్నదని, ఇంజిన్‌లోని భాగాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినా వారి ఆవేదనను ఆది నుంచి ఎవరూ పట్టించుకోవడం లేదు. అయితే, ఈ20 ఇంధనం కారణంగా తన వాహనం పదేపదే మరమ్మతులకు గురవుతున్నదని ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా వినియోగదారుల ఫోరమ్‌ను ఆశ్రయించిన ప్రేమ్‌రాజ్ అనే వ్యక్తికి అనుకూలంగా తీర్పు రావడం విశేషం.

వాహన కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం వాహనదారుల ఆరోపణలను కొట్టిపారేస్తుండటం, ఈ20 ఇంధనం వాడుతున్న వాహనాలకు బీమా నిరాకరిస్తున్న నేపథ్యంలో వెలువడిన తాజా తీర్పు ఇథనాల్ ఇంధనం దశదిశను నిర్ణయించే అవకాశం ఉంది. కలుషిత ఇంధనం వల్లనే వాహనం దెబ్బతిన్నదని అంగీకరించిన వాహన కంపెనీ.. అది ఎలా జరిగిందనే విషయంపై స్పష్టత ఇవ్వకపోవడం గమనార్హం. తాజా తీర్పు వాహనదారుల అనుమానాలకు బలాన్ని చేకూర్చడంతోపాటు నష్ట నివారణకు ఒక మార్గాన్ని చూపించింది. కాగా, సదరు కంపెనీ ఈ తీర్పును సవాల్ చేస్తామని ప్రకటించింది. కాగా, ఇది ఇంధన నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తడంతోపాటు వినియోగదారుల హక్కులకు భద్రత కల్పించే కేసుగా కనిపిస్తున్నది.

మరో సానుకూల అంశం ఏమిటంటే, కలుషిత ఇంధనం కారణంగానే వాహనం దెబ్బతిన్నదని అంగీకరించిన తరుణంలో అది ఎలా జరిగిందన్న దానిపై వాహన సంస్థ లేదా ప్రభుత్వం కచ్చితంగా స్పష్టత ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడింది. ఈ20 ఇంధనమే ఈ సమస్యకు మూలకారణమా? లేదా సరఫరా దశలో లోపం జరిగిందా? పెట్రోల్ బంకులలో నిల్వ సమయంలో ఇంధనం కలుషితమైందా? అన్నది తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.

ఈ మొత్తం వ్యవహారంలో బాధ్యతను ఎవరూ తీసుకోకపోవడమే అసలు సమస్యగా మారింది. పర్యావరణహితమనే పేరిట ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రోత్సహిస్తున్నది. వాహన కంపెనీలు అందుకు అనుకూలమైన హైబ్రిడ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. కానీ, ఈ20 కారణంగా నష్టం జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రం అందరూ బాధ్యతను భారంగా భావిస్తూ తప్పించుకుంటున్నారు. ఇదే వాహనదారులలో మరిన్ని అనుమానాలను పెంచుతున్నది. ఈ అనుమానాలను నివృత్తి చేస్తూనే, బాధ్యత తీసుకోకపోతే రాబోయే రోజుల్లో భారీ సంఖ్యలో వాహనదారులు వినియోగదారుల ఫోరమ్ తలుపు తట్టడం ఖాయం.