19 July, 2026 | 2:14 AM

ఆర్థిక వ్యవస్థ పయనమెటు?

19-07-2026 12:00 AM

ప్రపంచవ్యాప్తంగా నేడు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రశంసల జల్లు కురుస్తోంది. 2025- ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.5 నుంచి 7.8 శాతం వృద్ధిని నమోదు చేయనుందని అంచనాలు వస్తుండటం, ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటూ ప్రభుత్వ వ్యయాలు నియంత్రణలో ఉన్నాయని అధికారిక గణాంకాలు పేర్కొంటుండటం విశేషం. అయితే, ఏసీ గదుల్లో రూపుదిద్దుకునే ఈ అంకెల గారడీకి, క్షేత్రస్థాయిలో సామాన్యుడు అనుభవిస్తున్న కఠిన వాస్తవాలకు పొంతన కుదరడం లేదు.

ప్రస్తుత 7.5 శాతానికి పైబడిన జీడీపీ వృద్ధిరేటు ఒక భ్రమలాంటిదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకం టే ఈ వృద్ధికి బలమైన పునాది కనిపించడం లేదు. రోడ్లు, రైల్వేలు, డిజిటల్ మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న భారీ పెట్టుబడులు, సమాజంలోని ఎగువ వర్గాల వినియోగం వల్లే ఈ వృద్ధి కనిపిస్తోంది కానీ, గ్రామీణ భారతంలో నిత్యావసరాల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది. మరోవైపు అమెరికా- వాణిజ్య యుద్ధాలు, అంతర్జాతీయ సుంకాల హెచ్చుతగ్గుల వల్ల మన ఎగుమతులు మందగించడంతో, దేశీయ వినియోగం, ప్రభుత్వ ఖర్చులపైనే ఆధారపడిన వృద్ధి దీర్ఘకాలం నిలవడం కష్టంగా మారుతోంది.

దేశంలో ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతున్నా, దానికి అనుగుణంగా కొత్త ఉద్యోగాల సృష్టి జరగకపోవడం అతిపెద్ద లోపం. ఏఐ, ఆటోమేషన్ కారణంగా మానవ శ్రమ అవసరం తగ్గిపోతుండటంతో ఉత్పత్తి పెరుగుతోంది. కానీ, ఉద్యోగావకాశాలు పెరగడం లేదు. దేశ జీడీపీలో 60 శాతం వాటా ఉన్న సేవారంగం చదువుకున్న కొద్దిమందికే ఉపాధినిస్తోంది. చైనా తరహాలో కోట్ల మందికి ఆసరాగా నిలిచే తయారీరంగం మన దేశంలో ఇంకా బలపడలేదు.

డెలివరీ పార్ట్‌నర్స్, క్యాబ్ డ్రైవర్ల వంటి తాత్కాలిక (గిగ్) ఉద్యోగాలను ఉపాధిగా చూపిస్తున్నా, వీటికి ఉద్యోగ భద్రత, పీఎఫ్ వంటి సామాజిక రక్షణలు ఉండవు. దీనికి తోడు మన విద్యా వ్యవస్థలో నాణ్యత లోపించడం వల్ల డిగ్రీలు ఉన్నా ఉద్యోగాలకు అవసరమైన సాంకేతిక, సాఫ్ట్ స్కిల్స్ యువతలో కొరవడుతున్నా యి. ప్రస్తుతం మన ఆర్థిక ప్రయాణం ఆంగ్ల అక్షరం ‘కె’ ఆకారంలో సాగుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అంటే సమాజంలోని ధనిక, కార్పొరేట్ వర్గాలు మరింత పైకి దూసుకుపోతుంటే, పేద, మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారులు మ రింత కిందకు పడిపోతున్నారు. దేశ సంపద అంతా ఎగువన ఉన్న 10 శాతం మంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుండగా, లగ్జరీ కార్లు, ఖరీదైన ఫ్లాట్ల అమ్మకాలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతా ల్లో ద్విచక్ర వాహనాలు, నిత్యావసరాల అమ్మకాలు మందగించాయి.

సాధారణ ద్రవ్యోల్బణం అదుపులో ఉన్నట్లు కనిపిస్తున్నా పప్పులు , కూరగాయల వంటి ఆహార ద్రవ్యోల్బణం సామాన్యుడి వంటింటి బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తోంది. విదేశీ వాణిజ్యం విషయానికి వస్తే మన ఎగుమతుల కంటే దిగుమతుల విలువ ఎక్కువగా ఉండటం వల్ల వాణిజ్య లోటు నిరంతరం పెరుగుతోంది. విదేశీ నిధులు వెనక్కి వెళ్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో రూ పాయి విలువ క్షీణిస్తోంది. ప్రభుత్వం దేశీయ అప్పుల భారాన్ని పెంచుకుంటూపోతోంది. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ ద్వారా ని ధులు సేకరించడం తాత్కాలిక ఉపశమనమే తప్ప, శాశ్వత పరిష్కారం కానే కాదు. 

2047 నాటికి వికసిత్ భారత్‌గా అవతరించాలనే లక్ష్యం నెరవేరాలంటే జీడీపీ అంకెలను చూసి సంబరపడితే సరిపోదు. నేల మీద ఉన్న సమస్యలను నిజాయితీగా అంగీకరించి, వాటి పరిష్కారానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలలు, నైపుణ్య శిక్షణా కేంద్రాలపై బడ్జెట్ కేటాయింపులు పెంచడం ద్వారా మానవ వనరులపై పెట్టుబడి పెట్టాలి. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పన్ను రాయితీలు, సులువైన రుణాలు అందించి ప్రోత్సహించాలి.

అలాగే రైతులకు ఆధునిక సాంకేతికతను అందించడం తోపాటు, పంటలకు గిట్టుబాటు ధర కల్పించి వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించాలి. ఆర్థిక వృద్ధి ఫలాలు కొద్దిమందికే కాకుండా సమాజంలోని చివరి వ్యక్తికి కూడా అందినప్పుడే భారతదేశ ఆర్థిక ప్రయాణం నిజమైన అర్థంలో సఫలీకృతమవుతుంది.

 వ్యాసకర్త: జర్నలిస్ట్, 9010128884