బోధన్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, మార్చి 24(విజయ క్రాంతి) : బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఇలా త్రిపాఠి మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలోని అవుట్ పేషంట్ బ్లాక్, కాన్పుల విభాగం, ఇమ్యూనైజేషన్ గది, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఇతర విభాగాలను సందర్శించి అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణను, శిథిలావస్థకు చేరిన ఐసోలేషన్ వార్డు భవనాన్ని పరిశీలన జరిపారు.
అనంతరం జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాహుల్ తో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిని అనునిత్యం ఎంతమంది రోగులు సందర్శిస్తున్నారు, ఎక్కువగా ఎలాంటి వ్యాధులకు సంబంధించిన చికిత్సల కోసం వస్తున్నారు అని ఆరా తీశారు.
ఆసుపత్రిలో నెలకొని ఉన్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఒకే గైనకాలజిస్టు డాక్టరు సేవలు అందుబాటులో ఉన్నందున మరో గైనకాలజిస్టును నియమించేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సాధ్యమైనంత వరకు అన్ని రకాల ఆరోగ్య సేవలను స్థానికంగానే అందించాలని, అత్యవసరం అయితేనే నిజామాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రికి రిఫర్ చేయాలని సూచించారు.




