కార్మికుల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం
ప్రభుత్వ విప్ వేముల వీరేశం
కట్టంగూరు, మే 15 : విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం స్పష్టం చేశారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని సబ్ స్టేషన్లో నిర్వహించిన ఐఎన్ టియుసి 327 జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేముల వీరేశంమాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక విరుద్ధ విధానాలను అవలంబిస్తోందని విమర్శించారు.
కార్మికుల పని గంటలను 8 గంటల నుండి 12 గంటలకు పెంచాలని చూడటం దుర్మార్గమని పేర్కొన్నారు. గడిచిన 12 ఏళ్లుగా రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి బీజేపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలను నూనె వాడొద్దని, బంగారం కొనొద్దని చెప్పడం ప్రధాని నరేంద్ర మోదీకి తగదని విచారం వ్యక్తం చేశారు. ‘గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందే తప్ప అభివృద్ధి చేయలేదు‘ అని ఎమ్మెల్యే వీరేశం విమర్శించారు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, ఇప్పటికే అనేక హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.
నియోజకవర్గ అభివృద్ధికి తాము పెద్దపీట వేస్తున్నామని చెబుతూ.. ముఖ్యంగా విద్య, వైద్యం, సాగునీటి రంగాలపై దృష్టి సారించినట్లు తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో సుమారు రూ.200 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాన్ని చేపడుతున్నాం‘ అని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐ ఎన్ టి యు సి నల్గొండ డివిజన్ అధ్యక్షులు సమ్మిరెడ్డి, ప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, కార్మికులు, భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






