25 May, 2026 | 12:36 AM

రైతులకు కాంగ్రెస్ చేసిందేమీ లేదు

25-05-2026 12:06 AM
  1. వరంగల్ డిక్లరేషన్‌ను విస్మరించింది
  2. బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, మే 24 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిందేమీ లేదని, ఎన్నో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో వరి వేస్తే ఉరి అన్నారని,  ఆదుకుంటానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేసిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. వరంగల్ డిక్లరేషన్ అంటూ చెప్పడం తప్పితే.. చేసిందేమీ లేదన్నారు.

రైతులకు గన్నీ బ్యాగులు, సుతిలి, దారం కూడా ఇవ్వలేదన్నారు. అందుకే రైతుల సమస్యలు తెలుసుకునేందుకు స్వయంగా బీజేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించనున్నట్లు తెలిపారు. రైతులను నేరుగా కలిసి వారి కష్టాలు తెలుసుకుంటామన్నారు. తొలిరోజు పర్యటన తన పార్లమెంట్ పరిధి చేవెళ్లలో ఉందన్నారు.  

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రం విఫలం : ఏలేటి  

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి  విమర్శించారు. యాసంగి సీజన్‌కు సంబంధించి నేటికీ 30 శాతం ధాన్యం కూడా సేకరించలేదని, 80 శాతం కొనుగోలు చేశామని ముఖ్యమంత్రి అబద్దాలు చెబు తున్నారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి గింజా కొనుగోలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారని,  బోనస్ అన్నారని.. ఏమ య్యాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.8 లక్షల ఎకరాల్లో పొద్దు తిరుగుడు సాగు చేస్తే కొంతే కొనుగోలు చేసి రైతులను గాలికొదిలేశారని ఆయన మండిపడ్డారు. రైతుల కష్టాలు తెలుసుకొని వారికి అండగా ఉండటానికే బీజేపీ ఆధ్వర్యంలో చేవెళ్ల నుంచి రైతుగోస.. బీజేపీ భరోసా యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.