బీసీలను అణచివేసే కుట్రలు మానుకోవాలి
బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్ గౌడ్
ముషీరాబాద్, మే 24 (విజయక్రాంతి): టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌పై ఓ ఛానల్ చేస్తున్న దుష్ప్రచారాల పట్ల బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీలను రాజకీయంగా అణిచి వేయాలని కుట్రలో భాగంగా కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని మండిపడింది. ఈ మేరకు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ్‌గౌడ్ మాట్లాడారు. ఈ సంద ర్భంగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ ఎస్. దుర్గయ్య గౌడ్, కన్వీనర్లు అయిలి వెంకన్న గౌడ్, అంబాల నారాయణ గౌడ్, వైరి శేఖర్ గంగపుత్రలతో కలిసి ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్ మాట్లాడారు.
టీపీసీసీ చీఫ్ పదవి నుంచి మహేష్ కుమార్‌ను తొలగించి రెడ్డిలకు కట్టబెట్టాలనే కుట్ర జరుగుతోందన్నారు. మహేష్ కుమార్ టీపీసీసీ చీఫ్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాకే సర్పంచ్, మున్సిపల్, కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందని గుర్తు చేశారు. ఆ ఛానల్ కల్పిత కథనాల వెనుక అగ్రవర్ణ నాయకులున్నారని ఆరోపించారు. మహేష్ కుమార్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి ఎదిగారని, ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కి తన11 ఎకరాల సొంత భూమిని వితరణ చేశారని గుర్తు చేశారు. ఆ ఛానల్ క్షమాపణలు చెప్పని పక్షంలో ఛానల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ప్రత్యక్ష దాడులకు సైతం వెను కాడమని వార్నింగ్ జారీ చేశారు. ఈ సమావేశంలో జనసైన్యం అధ్యక్షుడు సింగం నరేష్, నారాయణ, నగేష్, వెంకటేష్ పాల్గొన్నారు.






