ఇరాన్‌లో పెళ్లివేడుకపై బాంబుదాడి
- ఐదుగురు మృతి, పలువురికి గాయాలు
- అమెరికాకు గుణపాఠం చెబుతాం: సుప్రీం లీడర్ ఖమేనీ
- పట్టాయాకు ‘అబ్రహాంలింకన్’
- తమ ఆధీనంలోనే హోర్ముజ్ జలసంధి: డొనాల్డ్ ట్రంప్
టెహ్రాన్/వాషింగ్టన్, సెప్టెంబర్ 2: పశ్చిమాసియాలో మరోమారు యుద్ధమేఘాలు అలముకుంటున్నాయి. రెండు రోజుల క్రితం అమెరికా ఇరాన్‌పై క్షిపణి దాడులతో (Missile attacks) విరుచుకుపడగా బుధవారం వేకువజామున ఓ పెళ్లి వేడుక జరుగుతున్న ఇంటిపై క్షిపణి దాడికి దిగింది. ఈ దాడిలో ఓ చిన్నారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిపై తీవ్రంగా మండిపడింది. హోర్ముజ్(Hormuz)పై ఆధిప త్యం కోసం అమెరికా ప్రయత్నిస్తోంది. మరోపక్క ఆ ప్రాంతంలో కాలు కూడా మోపనీయబోమని ఇరాన్ హెచ్చరిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో సముద్రమైన్లను మోహరించడంతో పలు రవాణా నౌకల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడ్డయి. పలు నౌకలు వాటిబారిన చిక్కు కొని ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇరాన్‌లోని కుహెస్తాక్ నగరంలో బుధవారం తెల్లవారుజామున ఓ నివాసంపై దాడి జరిగిందని ఇరా న్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ప్రకటించారు. ఈ దాడిలో ఐదుగురు మృతి చెందగా, పలువురికి గాయాల య్యాయని తెలిపారు.
గాయపడిన వారిలో అత్యధికులు మహిళలు, చిన్నారులు ఉన్నారని స్థానిక మీడియాకు తెలిపారు. ఇరాన్ సైనిక లక్ష్యాలపై మాత్రమే దాడులు చేశామని అమెరికా వెల్లడించింది. దీన్ని ఇరాన్ తోసిపుచ్చింది. ఇరాన్ పెళ్లివేడుక దాడులపై సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. అమెరికా బలగాలకు మర్చిపోలేని రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. సుమారుగా నెలరోజుల విరామం అనంతరం అమెరికా మరోమారు ఇరాన్‌పై దాడులను ప్రారంభించింది.
హోర్ముజ్ లోని వాణిజ్య నౌకలు, అమెరికా నౌకలపై ఇరాన్ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నెలకొన్న సమయం నుంచి సముద్ర జలాల్లో ఉన్న అమెరికా యుద్ధ వాహక నౌక అబ్రహం లింకన్ 5వేల మంది సైనికులు, నౌకా సిబ్బందితో థాయ్‌లాండ్‌లోని పట్టాయకు బయలుదేరింది. యూఎస్ సైనికులు, ఈ పట్టణంలో విశ్రాంతి కోసం వస్తుండడంతో పట్టాయలోని 50 మంది సెక్స్ వర్కర్లను స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇంకోపక్క సైనిక పరంగా పూర్తిగా దెబ్బతిన్న ఇరాన్ దేశంపై అణ్వాయుధం వాడాల్సిన అవసరం లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ చేతికి అణ్వాయుధాలు చిక్కితే ఇజ్రాయె ల్‌కు ముప్పు తప్పదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇరాన్‌ను ఒక విఫల దేశంగా అభివర్ణించారు. హోర్ముజ్ జలసంధి తమ అదుపులోనే ఉందని ట్రంప్ ప్రకటించారు. తమ నౌకాదళం సహాయం వల్లే ఆ ప్రాంతం నుంచి అనేక నౌకలు రవాణా కొనసాగిస్తున్నాయని ట్రంప్ వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో విలేకరి ప్రశ్నకు సమాధానం చెప్పారు.






