18-09-2025 07:02:55 PM
ఎంపీ ఈటెల రాజేందర్..
మేడిపల్లి (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో మన భారతదేశం కొత్త పుంతలు తొక్కుతుందని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ నవభారత్ గా అవతరిస్తుందని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్(MP Etela Rajender) అన్నారు. నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని మేడిపల్లి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. మోడీ పాలనలో దేశంలో డిజిటల్ విప్లవం కొనసాగుతుందని, కార్పొరేట్ వాణిజ్య సంస్థల నుంచి వీధి వ్యాపారం చేసే వ్యాపారులు వరకు డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
జి.ఎస్.టి స్లాబులను ఎత్తివేయడం వల్ల ఎంతోమంది పేదలకు లబ్ధి చేకూరిందని, ఆన్లైన్ గేమింగ్ వంటి చట్టాలను తీసుకొచ్చి యువకులు పెడదారి పట్టకుండా అడ్డుకట్ట వేశామని, ఇంకా అనేక విప్లవాత్మక చట్టాలు తీసుకొచ్చి ప్రపంచమంతా మన దేశం వైపు చూసేలా తీర్చిదిద్దుతున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి దక్కుతుందని ఈటల రాజేందర్ ఈ సందర్భంగా కొనియాడారు. పుట్టినరోజు వేడుకలు అనగానే నాన్న హంగామా చేసి సందడి చేయకుండా పదిమందికి ఉపయోగపడేలా ఇలా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని మేడిపల్లి మండల బిజెపి నాయకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ బిజెపి ఇంచార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.