ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలి
- సాంకేతిక సమస్యల పరిష్కారానికి తక్షణమే ప్రత్యేక చొరవ చూపాలి
- సమీక్షా సమావేశంలో శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
కొత్తగూడెం, ఏప్రిల్ 23, (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను నిర్దేశించిన గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అధికారులను ఆదేశించారు. గురువారం కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ, మండల స్థాయి అధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వివిధ దఫాలుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమకావాల్సిన బిల్లుల విషయంలో ఎదురవుతున్న లోపాలను వెంటనే సరిచేయాలని సూచించారు.
ముఖ్యంగా సాంకేతిక సమస్యల కారణంగా బిల్లులు నిలిచిపోకుండా స్థానిక అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. స్థానిక పరిధిలోని సమస్యలను ఇక్కడే పరిష్కరించి, రాష్ట్ర స్థాయిలోని పెండింగ్ అంశాలను సత్వరమే ఉన్నతాధికారులకు నివేదించి పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు అందేలా నిరంతరం పర్యవేక్షించాలని ఆయన పేర్కొన్నారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, హౌసింగ్ పిడి రవీంద్రనాథ్, కమిషనర్ సుజాత, ఎంపిడివోలు, తహసీల్దార్లు, గృహనిర్మాణ శాఖా అధికారులు పాల్గొన్నారు.






