అదానీ కోసం దేశం తాకట్టు
- ప్రధాని మోదీ రాజీ పడుతున్నారు
- అందుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు
- ఎక్స్ వేదికగా ఏఐసీసీ అగ్రనేత రాహుల్ విమర్శలు
న్యూఢిల్లీ, ఆగస్టు 12: అదానీకోసం ప్రధాని మోదీ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, రాజీ పడ్డారని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ బుధవారం ఎక్స్ వేదికగా ఆరోపించారు. గౌతమ్ అదానీకి సంబంధించిన కేసును అమెరికా కోర్టు కొట్టివేయడంతో మోదీపై రాహుల్ ఆరోపణలు సంధించారు. దేశ ప్రయోజనాలను అమ్ముకోవాల్సి ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. దీనివెనుక కంటికి కనిపించే దానికంటే ఎక్కువ ఉందని విమర్శించారు.
అదానీకోసం దేశం భారీ మూల్యం చెల్లిస్తోందని మండిపడ్డారు. అమెరికా కోర్టు గౌతమ్ అదానీ, ఆయన సోదరుడు సాగర్ అదానీలపై కేసు కొట్టివేసిన అంశానికి సంబంధించి స్క్రీన్‌షాట్‌ను రాహుల్ గాంధీ ఎక్స్‌లో పోస్ట్ చేసి మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 2024 నంబర్‌లో గౌతమ్, సాగర్ అదానీలతో సహా వినీత్ జైన్ తదితరులపై విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన ఒప్పందాలలో లంచాలు చెల్లించారనేది ప్రధాన ఆరోపణ. ఈ అంశంపై రాహుల్ గాంధీ గతం నుంచే తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.






