21 May, 2026 | 6:06 PM

దోచుకోవడం ఆ పార్టీలకు అలవాటే

21-04-2024 12:01 AM

l బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్

కామారెడ్డి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): తెలంగాణను దోచుకొవడంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందు దొందేనని, అది ఆ పార్టీలకు అలవాటేనని బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. కామారెడ్డి జిల్లా పరిధిలోని ఎల్లారెడ్డి, బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో శనివారం పార్టీ ఓబీసీ మోర్చా నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రధాని అయ్యాకే దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి వచ్చిందన్నారు. కేంద్రంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీపై ఒక్క అవినీతి ఆరోపణైనా లేదని కొనియాడారు.

దేశ ప్రజలకు అవినితీ రహిత పాలన అందిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు. పైకి మాత్రం పరస్పర ఆరోపణలు చేసుకుంటూ డ్రామాలు చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వమూ అనుసరిస్తుందని అభిప్రాయపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలు చేస్తున్న పనులకు పొంతన లేదని విమర్శించారు. ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు ఓటు వేసి అఖండ విజయాన్ని కట్టబెట్టాలని పిలుపునిచ్చారు. సమావేశాల్లో పార్టీ పార్లమెంట్ సెగ్మెంట్ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, ముఖ్య నేతలు లక్ష్మారెడ్డి,  ప్రబారి పెద్దోళ్ల గంగారెడ్డి, నరేందర్‌రెడ్డి, మర్రి రాంరెడ్డి, పైలా కృష్ణారెడ్డి, తానాజీరావు పాల్గొన్నారు.