11 July, 2026 | 1:19 AM

విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీయాలి

11-07-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 10(విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. జనకాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని, పఠనా సామర్థ్యం పెంపొందించడంతో పాటు వినూత్న బోధన పద్ధతులు అవలంబించాలని సూచించారు. మధ్యాహ్న భోజన నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలి

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత కోరారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో జిల్లాలో 50 శాతం పని పూర్తుందని, మిగతా ప్రక్రియను ఈ నెల 20లోగా పూర్తి చేసేలా అధికారులు, పార్టీ ప్రతినిధులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

భూముల రీ సర్వేను పక్కాగా చేపట్టాలి

జిల్లాలో రెవెన్యూ నక్షాలు లేని గ్రామాలను గుర్తించి భూముల రీ-సర్వే చేపట్టి గ్రామ నక్షాలు రూపొందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత ఆదేశించారు. రీ-సర్వే ద్వారా రైతులకు మేలు కలుగుతుందని, భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గుతాయని తెలిపారు. సర్వేకు ముందు గ్రామసభలు నిర్వహించి, ప్రభుత్వ గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.