రైతు డిక్లరేషన్‌కు సమాధి
- కాంగ్రెస్ కేబినెట్ నిర్ణయాలతో రైతాంగానికి అన్యాయం
- మాజీ మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట, జూన్ 19 (విజయక్రాంతి): రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, రైతు డిక్లరేషన్‌ను రా హుల్ గాంధీ జన్మదినం రోజే సమాధి చేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు. శుక్రవారం సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాం గ్రెస్ కేబినెట్ తీసుకున్న తాజా నిర్ణయాలు రైతాంగానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఎన్నికల ముం దు అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ నాయకత్వం, ఇప్పుడు బో నస్ లేదని,
అన్ని పంటలను కొనుగోలు చే యబోమని ప్రకటించడం రైతులను మోసం చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం కొనుగోలు చేసే పంటలనే, కేంద్రం చెప్పిన పరిమితిలోనే కొనుగోలు చేస్తామం టూ రైతు డిక్లరేషన్‌కు సమాధి కట్టడమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించుకుంటూ రైతులను మార్కెట్ దళారుల దయాదాక్షిణ్యాలపై వదిలేస్తోందని విమర్శించారు. యూరియా పంపిణీ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమా డు తున్నాయని ఆరోపించారు. ఎకరాకు రెండు బస్తాల యూరియా పరిమితి విధించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పోలీ సు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేయడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
రైతుబంధు, రైతుభరోసా, రైతుబీమా అమలులోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీశ్‌రావు విమర్శించారు. రైతుబంధు నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని, వేలాది మం ది రైతు కుటుంబాలకు అందాల్సిన రైతుబీమా నిధులు నెలల తరబడి నిలిచిపోయా యని ఆరోపించారు. ‘కొనుగోళ్లు ఖతం.. రైతుబంధు ఖతం.. రైతుబీమా ఖతం.. యూరియా ఖతం.. రైతులకు గోచి తప్పా ఏమీ మిగల్చని పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించింది’ అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. దేశానికి అన్నం పెట్టే రైతే ప్రభు త్వాలకు ప్రథమ ప్రాధాన్యత కావాలని, కేబినెట్ తీసుకున్న రైతు వ్యతిరేక నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకుని రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరారు.






