24 May, 2026 | 12:26 AM

వేతన పెంపు నిర్ణయం హర్షణీయం

24-05-2026 12:00 AM

ఐఎన్టీయూసీ జాతీయాధ్యక్షుడు సంజీవ రెడ్డి

ముషీరాబాద్, మే 23 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని కార్మికులకు కనీస వేతనాలను పెంచుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు జీ సంజీవ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో గత 12 సంవత్సరాలుగా వేతన సవరణ జరగకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హైదరాబాద్ అంబర్‌పేట్ డీడీకాలనీలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనేక ఏళ్లుగా అరకొర వేతనాలతో కార్మికులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయలేక ఇతర రాష్ట్రాలకు తరలివెళుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల కొరతతో ఇప్పటికే చాలా కంపెనీలు మూతపడ్డాయని, ఉన్న కొద్ది కంపెనీల ఉత్పత్తి కూడా తగ్గిపోయిందన్నారు.

ట్రేడ్ యూనియన్లను రద్దు చేసి గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికులను, వారి హక్కులను కాలరాసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు మొగుళ్ళ రాజిరెడ్డి మాట్లాడుతూ.. వేతన సవరణ కార్మికులకు నేరుగా చేరే విధంగా చర్యలు తీసుకోవాలని, మధ్యలో కమీషన్లు దండుకుంటున్న దళారీ వ్యవస్థను తొలగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర కోశాధికారి జగన్‌మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.