రాజకీయ విలువల క్షీణత!
- ఖర్గే చేసిన ‘మోదీ టెర్రరిస్ట్’ వ్యాఖ్యలపై దుమారం
- నానాటికీ రాజకీయాల్లో పడిపోతున్న గౌరవమర్యాదలు
- ఎక్కువవుతున్న వ్యక్తిగత దూషణలు
- నాడు భారత రాజకీయాలు ప్రపంచానికే ఆదర్శం
- నేడు విలువల పతనానికి వేదికగా భారత్
న్యూ ఢిల్లీ, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): దక్షిణాదిలో ఇటీవల ముగిసిన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో రాజకీయాల్లో ఉండే గౌరవమర్యాదల పలుచని పొర మరోసారి చినిగిపోయింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెన్నై వేదికగా ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ సభా వేదికను దాటి దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తున్నాయి. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే, చివరి రోజు మల్లిఖార్జున ఖర్గే ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమిపై విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఖర్గే మాటతూలారు. ఎన్డీయేతో ఎలా చేతులు కలుపుతారని అన్నాడీఎంకేను ప్రశ్నించే క్రమంలో ‘మోదీ ఒక ఉగ్రవాది’ అని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆయన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది.
అప్పటికే ఎన్నికల కారణంగా దేశంలో రాజకీయ వేడి రాజుకోగా, ఈ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టయింది. వెంటనే ఖర్గే వ్యాఖ్యల పట్ల బీజేపీ శ్రేణుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపీ సీనియర్ నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు ఖర్గే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది ప్రధాని మోదీని మాత్రమే అవమానించినట్టు కాదని, దేశ గౌరవానికి భంగం కలిగించే విషయమని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో ఖర్గే తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరిచి విపక్ష నేతలను బెదిరింపులకు గురిచేయడం, అధిక పన్నులు విధించడం (ట్యాక్స్ టెర్రిరిజం) గురించి మాత్రమే తాను మాట్లాడానని, తనకు ఎలాంటి దురుద్దేశం లేదని ఆయన చెప్పారు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన వ్యాఖ్యలు దేశమంతటా పాకిపోయాయి. చర్చలు, వివాదాలకు కేంద్రబిందువుగా మారిపోయాయి.
మన దేశ రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇది భారత రాజకీయాల్లో పెరుగుతున్న విపరీత ధోరణికి నిదర్శనమని చెప్పవచ్చు. గతంలో మన దేశంలో ప్రభుత్వాల విధానాలపై చర్చలు, వాదనలు జరిగేవి. విధానాలపైనే విమర్శలు చేసేవారు. కానీ, ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు, దూషణలు నానాటికీ పెరిగిపోతుండటం ఆందోళనకరం.
కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్త కాదు. ఈ తరహా వ్యాఖ్యల మూలంగా కాంగ్రెస్ పార్టీ గతంలో మూల్యం కూడా చెల్లించుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ గతంలో ప్రధాని మోదీని ‘నీచమైన మనిషి’ అని సంబోధించడాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇప్పుడు ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కూడా అదే తరహా విమర్శలు వస్తున్నాయి.
రాజకీయాల్లో అధికార, విపక్ష నేతలు పరస్పరం ఒకరినొకరు గౌరవించుకోవడంలో గతంలో భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేది. జవహర్‌లాల్ నెహ్రూ, అటల్ బిహారి వాజపేయ్ మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. వీరి మధ్య విధానాపరమైన విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా మాత్రం ఒకరినొకరు ఎంతో గౌరవించుకునేవారు. వాజపేయ్ విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు తన కార్యాలయంలో నెహ్రూ చిత్రపటాన్ని తిరిగి పెట్టాలని ఆయన ఆదేశించడం నాటి సంస్కృతికి నిదర్శనం. అలాగే పీవీ నరసింహారావు 1994లో జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి వాజపేయ్‌ని భారత ప్రతినిధిగా పంపడం నాటి రాజకీయ నేతల మధ్య ఉన్న విశ్వాసం, గౌరవమర్యాదలను ప్రతిబింబిస్తోంది.
1950 మధ్యకాలంలో మన దేశంలో ముఖ్యంగా ప్రభుత్వాల విధానాలపై మాత్రమే చర్చలు జరిగేవి. 1990లలో కూటమి రాజకీయాలు సంయమనాన్ని నేర్పించాయి. అయితే 2014 తర్వాత రాజకీయ భాష మరింత కఠినంగా మారింది. విధానపరమైన విమర్శలకు బదులుగా వ్యక్తిగత విమర్శలు ఎక్కువయ్యాయి. గతంలో మౌత్ కా సౌదాగర్, చౌకీదార్ చోర్ హై, ఇప్పుడు టెర్రరిస్ట్ వంటి పదజాలం వినిపించడం సర్వసాధారణమైపోయింది.
ఇలాంటి తీవ్ర పదజాలం రాజకీయ నేతల నుంచి వినిపిస్తే, అది సమాజంలో విభజనను పెంచుతుంది. సోషల్ మీడియా వేదికలు ఆగ్రహాన్ని మరింత పెంచే ప్రమాదముంది. మన దేశంలో ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య పోటీగా కాకుండా, రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగతంగా ఓడించే యుద్ధక్షేత్రాలుగా మారుతున్నాయి. ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమో, లేదా పొరపాటో కాదు. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పెరుగుతున్న రాజకీయ గౌరవమర్యాదల సంక్షోభానికి సూచిక. గెలుపోటములు శాశ్వతం కాదు, రేపటి రోజున అధికారంలోకి మరొకరు రావచ్చు, మరో పార్టీ అధికార పీఠమెక్కవచ్చు. కానీ, ప్రజాస్వామ్య విలువలు, రాజకీయ నేతలు ఇచ్చిపుచ్చుకునే గౌరవం మాత్రమే శాశ్వతం. ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలి. భారత రాజకీయాలు మళ్లీ తన పూర్వపు విలువల్ని సంతరించుకోవాలంటే, నాయకులు పాత తరం నాయకుల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. గౌరవంతో కూడిన వాదోపవాదాలే ప్రజాస్వామ్య బలాన్ని పెంచుతాయి.






