24 April, 2026 | 5:25 PM

ఆమ్‌ ఆద్మీ పార్టీకి బిగ్‌ షాక్.. బీజేపీలోకి రాజ్యసభ సభ్యులు

24-04-2026 04:15 PM

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ(Aam Aadmi Party) పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు భారీ షాక్ తగిలింది. ముగ్గురు ఆప్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు మొదలైందనే చెప్పాలి. ఇటీవల పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి ఆప్ రాఘవను తొలగించిన విషయం తెలిసిందే. రాజ్యాంగంలోని నిబంధనలను ఉటంకిస్తూ, రాజ్యసభలో తమ పార్టీ సభ్యులలో మూడింట రెండు వంతుల మంది భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party)లో విలీనం కావాలని నిర్ణయించుకున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ రాఘవ్ చద్దా శుక్రవారం ప్రకటించారు.

సహచర ఎంపీలు సందీప్ పాఠక్, అశోక్ మిట్టల్‌లతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో రాఘవ్ చద్దా మాట్లాడుతూ... ఫిరాయింపుల నిరోధక చట్టం పరిధిలో రక్షణ కోరేందుకు అవసరమైన మెజారిటీతో ఈ నిర్ణయాన్ని సమిష్టిగా తీసుకున్నట్లు తెలిపారు. "నేను నా రక్తం, చెమటతో పోషించి, నా యవ్వనంలోని 15 ఏళ్లను అంకితం చేసిన ఆప్ (AAP) పార్టీ, తన సూత్రాలు, విలువలు, మౌలిక నైతికత నుండి పక్కదారి పట్టింది. ఇప్పుడు ఈ పార్టీ దేశ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం తన స్వప్రయోజనాల కోసమే పనిచేస్తోంది. గత కొన్ని ఏళ్లుగా, 'నేను సరైన వ్యక్తిని అయినప్పటికీ, తప్పుడు పార్టీలో ఉన్నాననే' భావన నాకు కలుగుతూ వచ్చింది. కాబట్టి, ఈ రోజు నేను 'ఆప్' నుండి వైదొలుగుతూ, ప్రజలకు మరింత చేరువవుతున్నట్లు ప్రకటిస్తున్నాను." అంటూ ఆయన పేర్కొన్నారు.