19-01-2026 12:22:00 AM
కరీంనగర్, జనవరి 18 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలో గత 6 సంవత్సరాలుగా జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ నాయకుల కళ్ళకు కనబడటం లేదని బీజేపి నాయకులు, మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు ఒక ప్రకటనలో మండి పడ్డారు. నగరంలో ప్రజల సౌకర్యాల కోసం చేసిన ఏ అభివృద్ధి పనులు కనబడని కబోదుల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తయారయ్యారని ద్వజమెత్తారు. బీజేపి నాయకులు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో కరీంనగర్ నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం గత 6 సంవత్సరాల్లో దాదాపుగా 1000 కోట్ల రూపాయల నిధులు తీస్కరావడం జరిగిందన్నారు.
అంతే కాకుండా రైల్వే ఓవర్ బ్రిడ్జితో పాటు ఇతరత్ర అభివృద్ధి పనులకు కూడ మరో 200 కోట్లను తీస్కరావడం జరిగిందన్నారు. కళ్ల ముందు జరిగిన అభివృద్ధిని చూడలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు.... అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటినా ఒక నయా పైసా నగరపాలక సంస్థ అభివృద్ధి కోసం తీస్కరాకపోవడం వారి చేతగాని తనానికి నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు వారి చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి భారతీయ జనతా పార్టీ, బండి సంజయ్ పై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.
నగరంలో భారతీయ జనతా పార్టీ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ ఎన్నికల్లో వస్తున్న విజయాన్ని తట్టుకోలేక అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని ద్వజమెత్తారు. మీకు దమ్ముంటే కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట ముఖ్యమంత్రి నుండి నిధులు తెచ్చి అభివృద్ధి చేసి చూపించాలని సవాల్ విసిరారు. జరిగిన అభివృద్ధి పై అనవసరపు ఆరోపణలు చేస్తూ... రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తే... ప్రజలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా బుద్ది చెప్పడం ఖాయమని సునీల్ రావు పేర్కొన్నారు.