గిగ్ కార్మికుల జీవన పోరాటం
దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ డెలివరీ సేవలు, యాప్ ఆధారిత రవాణా వ్యవస్థలు విస్తరించిన నేపథ్యంలో లక్షలాది మంది యువకులు, మహిళలు గిగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆహార సరఫరా, ఈ- డెలివరీలు, క్యాబ్ సేవలు, పార్సిల్ రవాణా వంటి రంగాల్లో పనిచేస్తున్న ఈ కార్మికులు నగర జీవన వ్యవస్థలో కీలక భాగస్వాములుగా మారారు. కానీ, వారి కష్టాలు, సమస్యలను మాత్రం అధికార యంత్రాంగం, కంపెనీలు పట్టించుకోవడం లేదు.
ముఖ్యంగా ఇది వేసవి. మండుటెండలో గిగ్ కార్మికులు చెమటలు కక్కుతూ పనిచేస్తున్నారు. ఉద్యోగులను గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. సమయానికి నిత్యావసర సరుకులు చేరవేస్తున్నారు. అంతశ్రమించే కార్మికులకు నగరాల్లో కనీస వసతులు ఉన్నాయా? వారి కోసం ఏమైనా విశ్రాంతి స్థలాలు ఉన్నాయా? మరుగుదొడ్లు ఉన్నాయా? తాగునీటి కేంద్రాలున్నాయా? సరైనా బీమా ఉందా? అనారోగ్యానికి గురైతే ఏదైనా డిస్పెన్సరీకి వెళ్లి చికిత్స చేయించుకునే సౌకర్యం ఉందా? ఇలా.. ఏ ఒక్క వసతైనా గిగ్ కార్మికులకు లేదు.
2025లో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ గిగ్ కంపెనీలకు కొన్ని సూచనలు చేసింది. గిగ్ కార్మికులకు కచ్చితంగా భద్రతా కిట్ ఇవ్వాలని, ఎండ తీవ్రత ఉంటే కచ్చితంగా కార్మికులకు విరామం ఇవ్వాలని, అవసరమైతే ఎండ తగ్గే వరకు పని నిలిపివేసేందుకు అవకాశం ఇవ్వాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అయినప్పటికీ, ఒక్క కంపెనీ అయినా ఆ మార్గదర్శకాలు అమలు చేయడం లేదు. ఇప్పటికైనా కంపెనీలు స్పందించాలి.
ప్రతి రెస్టారెంట్, మాల్, దుకాణ సముదాయాల్లో గిగ్ వర్కర్ల కోసం తాగునీటి వసతి ఏర్పాటు చేయించాలి. విశ్రాంతి స్థలం, మరుగుదొడ్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. ఈ సదుపాయాలు కల్పించని సంస్థలతో యాప్ ఆధారిత కంపెనీలు ఒప్పందాలు చేసుకోకూడదు. గిగ్ వర్కర్ల రెక్కల కష్టంపై కంపెనీ యజమానులు కుబేరులవుతుంటే, కార్మికులు మాత్రం కనీస వసతులకు నోచుకోకూడదా?
ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్






