8 June, 2026 | 1:57 AM

మంచినీటి సమస్య పరిష్కరించాలి

08-06-2026 12:40 AM

మాజీ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి డిమాండ్

మేడిపల్లి, జూన్ 7 (విజయక్రాంతి): మంచినీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని పిర్జాదిగూడ మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పీర్జాదిగూడ ఓల్ విల్లెజ్ గుట్ట,  డబుల్ బెడ్రూమ్ సముదాయం ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో కలిసి మాట్లాడి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కాలనీవాసులు తీవ్ర తాగునీటి సమస్యను నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నీరు వస్తోందని, అవసరాలకు సరిపోవడం లేదని మహిళలు వాపోయారు. చాలామంది తాగునీటి కోసం ప్రైవేట్ ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోందని, దీంతో అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. అలాగే  కొన్ని గల్లిలలో రోడ్డు నిర్మాణం, డ్రైనేజి సమస్యలతో పాటు రోడ్ల మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే తొలగించాలని స్థానికులు కోరారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు బిల్లులు రాక నిలిచిపోయాయని అప్పులు తెచ్చి అద్దె కట్టుకునే  పరిస్థితి వచ్చిందని పలువురు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్లు కల్పించి స్వచ్ఛమైన తాగునీటిని అందించేలా చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు.

పీర్జాదిగూడ గుట్టపై సుమారు 50 లక్షల లీటర్ల సామర్థ్యంతో భారీ నీటి రిజర్వాయర్ను నిర్మించి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులు కల్పించినప్పటికీ, ప్రస్తుతం ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా అందకపోవడం బాధాకరమని అన్నారు.  వెంటనే నీటి సరఫరా వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి క్రమం తప్పకుండా స్వచ్ఛమైన తాగునీరు అందేలా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొల్తూరి మహేష్, దొంతిరి హరిశంకర్ రెడ్డి, సీనియర్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, మహిళా అధ్యక్షురాలు నిర్మల, మైనార్టీ అధ్యక్షులు జిలాని పాషా, ఆకుల మధుకర్, శ్యామాల శ్రీనివాస్, శ్రీకాంత్, కౌడే సాయి శరత్, బాలరాజు, కోనేటి వెంకట్, యాసారం శ్రీనివాస్, మునికుంట్ల కిరణ్ గౌడ్, గడీల జగన్ రెడ్డి, అశోక్ రెడ్డి, సాగర్ రెడ్డి, జమీల్, పన్నబాయ్, గోపాల్ రెడ్డి, పాశం నరేందర్ రెడ్డి, సురేష్, పుల్ల శ్రీనివాస్, వెంకట్, వేంకటరమణ తదితరులు కలిసి పాల్గొన్నారు.