9 July, 2026 | 12:59 AM

ప్రయోగశాలగా మారిన విద్యావ్యవస్థ

09-07-2026 12:00 AM

గత పాలకుల హయాంలో మూతపడిన ఆరు వేల బడులను మెరుగైన సదుపాయాలతో తిరిగి తెరుస్తామని, విద్యపై పెట్టే ఖర్చు భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి అని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ, అధికారంలోకి రాగానే పాఠశాలల మూసివేత వంటి తిరోగమన నిర్ణయానికి పూనుకోవడం ప్రజాస్వామ్య ద్రోహమే అవుతుంది.

తెలంగాణ విద్యావ్యవస్థ పునాదుల ను తీవ్రంగా కదిలించేలా, రాష్ట్రంలోని దాదాపు ఇరవై మూడు వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్న వార్త తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బెంగళూరు వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన ఈ ‘క్లస్టరింగ్’ లేదా విలీన విధానంపై జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్ హరగోపాల్, రాష్ట్రానికి చెందిన మేధావులతో కూడిన పౌరసమాజం లేవనెత్తిన గళం పాలకుల కళ్లు తెరిపించాల్సిన సందర్భమిది.

ప్రభు త్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామం టూ, నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందిస్తామంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా బడుల సంఖ్యను ౨౩ వేల నుంచి నాలుగు వేలకు కుదించాలనుకోవడం ఏమాత్రం సంస్కరణ అనిపించు కోదు. ఇది అనాలోచిత విద్యా సంహారంగా మారే ప్రమాదం ఉందని విద్యా వేత్తలు గట్టిగా హెచ్చరిస్తున్నారు.

సామాజిక చైతన్య వేదిక

ఒక ఊరికి బడి అనేది కేవలం అక్షరాలు నేర్పే నాలుగు గోడల కేంద్రం కాదు. అదొక సామాజిక చైతన్య వేదిక, గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టే నిలువుటద్దం. మే ధావుల బహిరంగ లేఖలో పేర్కొన్నట్లు, ఈ నిర్ణయం గనుక క్షేత్రస్థాయిలో అమలైతే దాదాపు పదిహేను వేల గ్రామాలు ‘బడి లేని ఊళ్లుగా’ మారిపోయే ప్రమాదం స్ప ష్టంగా కనిపిస్తోంది. ఇది రాజ్యాంగం క ల్పించిన ప్రాథమిక హక్కులను, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని బాహాటం గా తుంగలో తొక్కడమే అవుతుంది.

డ్రాపౌట్లు పెరిగే ప్రమాదం

ఇంటి ముంగిట బడి లేకపోతే, ఆర్థిక స్తోమత లేని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువును మధ్యలోనే ఆపేసే దుస్థితి దాపురిస్తుంది. కిలోమీటర్ల దూరం ప్రయాణించి పక్క ఊర్లకు వెళ్లి చదువుకునే సామాజిక వాతావరణం, భద్రత ఇంకా మన గ్రామాల్లో పూర్తిస్థాయిలో నెలకొనలేదు. దీనివల్ల డ్రాపౌట్ల సంఖ్య విపరీతం గా పెరిగిపోయి, బాల్యమంతా చదువుకు దూరమై మళ్లీ పాత రోజుల్లో లాగా బాలకార్మిక వ్యవస్థ వైపు మళ్లే ప్రమాదం పొంచి ఉంది. 

బడ్జెట్‌లో భారీ నిధులెక్కడ?

గత పాలకుల హయాంలో మూతపడిన ఆరు వేల బడులను మెరుగైన సదుపాయాలతో తిరిగి తెరుస్తామని, విద్యపై పెట్టే ఖర్చు భవిష్యత్తుపై పెట్టే పెట్టుబడి అని ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికింది. కానీ, అధికారంలోకి రాగానే ఇలాంటి తిరోగమన నిర్ణ యానికి పూనుకోవడం ప్రజాస్వామ్య ద్రో హమే అవుతుంది. బడ్జెట్‌లో విద్యకు పదిహేను శాతం నిధులు ఇస్తామని వాగ్దానం చేసి, ఆచరణలో నిధుల కోత విధించడం పాలకుల ద్వంద్వ నీతిని స్పష్టం చేస్తోంది.

ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణం పాలకుల నిర్లక్ష్యం, మౌలిక వసతుల లేమి, ఉపాధ్యాయుల కొరతే తప్ప, పిల్లలకు, వారి తల్లిదండ్రులకు చదువుపై ఆసక్తి లేకపోవడం కాదు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీని అదుపు చేసేందుకు జీవో నెంబర్ వన్‌ను పకడ్బందీగా అమలు చేయడంలో వైఫల్యాలు ప్రభుత్వ పాఠశాలల పతనానికి కారణమయ్యాయి.

అయితే, ఈ సంక్లిష్టమైన వ్యవహారాన్ని కేవలం రాజకీయ కోణంలోనే కాకుండా పాలకుల పరిపాలనా వ్యూహం వైపు నుం చి కూడా నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఒకే ఒక్క విద్యార్థి లేదా ఐదు గురు విద్యార్థుల కోసం ఒక బడిని నడపడం, అక్కడ ఒకే ఉపాధ్యాయుడితో ఐదు తరగతుల పిల్లలకు నాణ్యమైన విద్య అం దించడం ఆచరణాత్మకంగా అసాధ్యమనే వాదనలోనూ కొంత హేతుబద్ధత ఉంది. పాఠశాలల్లో విద్యార్థులు లేకపోయినా కేవలం భవనాలను కాపాడుకుంటూ కూ ర్చోవడం వల్ల ఆశించిన విద్యా ప్రమాణాలు సాధించలేమ న్నది పాలకుల ఆలో చన కావచ్చు.

వనరులను విచ్ఛిన్నం చేయ డం కంటే, ఒక క్లస్టర్ పరిధిలో అన్ని రకాల ఆధునిక సదుపాయాలు, ప్రతీ సబ్జెక్టుకు నిపుణులైన ఉపాధ్యాయులు, డిజిటల్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆట స్థలాలు ఉన్న ఒక సమగ్రమై న మోడల్ స్కూల్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించవచ్చనేది ప్రభుత్వ యోచన కావచ్చు. కానీ, ఒకవేళ ప్రభుత్వం నిజంగానే విద్యా ప్రమా ణాల మెరుగుదల కోసమే ఈ విలీన ప్రక్రియను చేపట్టదలిస్తే, ప్రతీ గ్రామం నుంచి విద్యార్థులను సురక్షితంగా, ఉచితంగా పా ఠశాలలకు చేర్చే బాధ్యతను ప్రభుత్వమే పూర్తిస్థాయిలో స్వీకరించాలి.

విదేశాల్లో మెరుగైన వ్యవస్థ

అమెరికా, యూరప్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో స్కూల్ బస్సుల ద్వారా విద్యార్థులను కేంద్రీకృత పాఠశాలలకు తరలించే విధానం విజయవంతమైంది. కానీ, మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో క్షేత్రస్థాయి మౌలిక వసతులపరంగా అ లాంటి పటిష్టమైన రవాణా ప్రణాళిక లే కుండా నేరుగా పల్లెల్లోని బడులను మూసివేస్తామని చెప్పడం కచ్చితంగా తొందర పాటు చర్య అవుతుంది.

బడ్జెట్ భారాన్ని తగ్గించేందుకేనా?

రవాణా వ్యవస్థ సరిగ్గా లేని కారణంగా ఏ ఒక్క పేద బిడ్డ బడికి దూరమైనా, అది ఈ సంక్షేమ ప్రభుత్వానికి పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. విద్య అనేది లాభనష్టాలను బేరీజు వేసే వ్యాపార రంగం కాదు. అది ఒక తరం భవిష్యత్తును తీర్చిదిద్దే అ త్యున్నత సామాజిక బాధ్యత. బడ్జెట్ భారాన్ని తగ్గించుకోవడమే పరమావధిగా చూస్తే, అది సంక్షేమ ప్రభుత్వ లక్షణం అనిపించుకోదు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యా విధానాలను ప్రయోగశాలలుగా మార్చడం వల్ల నష్టపోయేది విద్యార్థులే.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రతిపాదనలపై మొండిగా ముందడుగు వేయకుం డా, వెంటనే మేధావులు, ఉపాధ్యాయ సం ఘాలు, పౌర సమాజంతో విస్తృతస్థాయి చర్చలు జరపాలి. క్షేత్రస్థాయి వాస్తవాలను గౌరవిస్తూ, ఏ ఒక్క పేద బిడ్డ కూడా పాఠశాల సుదూరంగా ఉందనే కారణంతో బడికి దూరం కాకుండా చూస్తూనే, విద్యా ప్రమాణాలను పెంచే సమతుల్య విధానాన్ని అవలంబించడమే నేటి తెలంగా ణకు అత్యంత ఆవశ్యకం.

ఏకపక్ష నిర్ణయాలు సరికాదు 

విద్యా వ్యవస్థను కేవలం సంఖ్యల రూ పంలో చూడకుండా, గుణాత్మక మార్పుల వైపు నడిపించడమే నిజమైన అభివృద్ధి అనిపించుకుంటుంది. ప్రభుత్వ పాఠశాలలు మనుగడ సాగిస్తేనే సమాజంలో స మానత్వం సాధ్యమవుతుంది. ప్రైవేటు శక్తు ల చేతుల్లోకి విద్య పూర్తిగా వెళ్లిపోతే సా మాజిక అసమానతలు మరింత పెరుగుతాయి. కాబట్టి, ప్రభుత్వం తన ముందస్తు వ్యూహాలను పునఃసమీక్షించుకుని, ప్రజామోదంతో సంస్కరణలను అమలు చేయా లి.

ఒక ప్రజాస్వామ్య సమాజంలో ఏకపక్ష నిర్ణయాల వల్ల ఆందోళనలు తీవ్రతరమవుతాయే తప్ప సమస్యలు పరిష్కారం కావు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ మొండి పట్టుదలకు పోకుండా మేధావు లు, విద్యావేత్తలు సూచనలు, హెచ్చరికలను సానుకూలంగా స్వీకరించాలని, విద్యారంగాన్ని కా పాడే చర్యలు చేపట్టాలని తెలంగాణ సమా జం ముక్తకంఠంతో కోరుతోంది.

 వ్యాసకర్త: జర్నలిస్ట్, 9848559863