‘సుదర్శన చక్ర’తో సురక్షిత భారత్!
చలాది పూర్ణచంద్ర రావు :
భారత ప్రధాని మోదీ ఆలోచనల మేరకు చేపట్టిన ‘మిషన్ సుదర్శన చక్ర’ రక్షణ వలయం కిందికి 2035 నాటికి భారతదేశం రానున్నది. భారత పౌరాణిక, సాంస్కతిక వారసత్వాల స్ఫూర్తితో చేపట్టిన ఈ ప్రాజె క్టు దేశంపై జరిగే దాడులను నిరోధించే సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేస్తుం ది. ఇది పూర్తయితే శత్రుదేశాల సైనిక దాడులతో పాటు ఉగ్రవాద దాడులను కూడా సమర్థవంతంగా నిలువరించవచ్చు. భారత ప్రజలను కాపాడుతూనే, మౌలిక వసతులు దెబ్బతినకుండా చూడగలిగే ఈ కవచం సైబర్, భౌతిక రక్షణలను మిళితం చేస్తూ ఏఐ సామర్థ్యంతో పనిచేసే ఒక బహుళ పొరల రక్షణ వ్యవస్థ.
ఈ ప్రాజెక్ట్ ప్రధానంగా ఇజ్రాయెల్‌లో ఉన్న ఐరన్ డోమ్, అమెరికాలోని గోల్డెన్ డోమ్‌లను పోలి ఉంటుంది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నది. సుదర్శన చక్ర అందుబాటులోకి వస్తే భారత్ అత్యంత సురక్షిత దేశంగా మారుతుంది. దీని ద్వారా భారత ప్రజలు, ఆస్తులు, మౌలిక వసతులు, వ్యవస్థలను సురక్షితంగా ఉంచటమే ప్రభుత్వ లక్ష్యం.
బాలిస్టిక్ మిస్సైల్స్ హైపర్ సోనిక్ ప్లాట్‌ఫామ్‌లు, యుద్ధ విమానాలు, మందుగుండు సామగ్రి, డ్రోన్‌లు మొదలైన బహుళ వెక్టా ర్ ముప్పులను నిరోధించేందుకు వేగం, కచ్చితత్వంతోపాటు అతి సమర్థతతో రక్షణ ప్రతిస్పందనను సులభతరం చేయగలిగే సత్తా దీనికి ఉంది. శ్రీమహావిష్ణు దివ్య ఆయుధమైన ‘సుదర్శన చక్రం’ నుంచి ప్రేరణ పొంది ఈ ప్రాజెక్టుకు ఆ పేరు పెట్టినట్టు 2025 ఆగస్టు 15న ఎర్రకోట వేది కగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయం విదితమే.
ఆత్మనిర్భర్ పథకంలో భాగంగా ఈ మిషన్ ఆర్కిటెక్చర్, పరిశోధన, అభివృద్ధితో పాటు విడిభాగాల తయారీ భారత్ లోనే జరుగుతుంది. భారతీయ సైన్యం, ప్రైవేటురంగ సంస్థల భాగస్వామ్యంతో ఈ వ్యవస్థ రూపొందుతుంది. 2020లో ఘర్షణల తర్వాత చైనా నుంచి సైబర్ దాడులు పెరగడం, పహల్గాం ఉగ్రదాడి తర్వాత --పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు తీవ్రమవడం, ఆసమ యంలో గోల్డెన్ టెంపుల్‌ను లక్ష్యంగా చేసుకుని జరిగిన డ్రోన్, క్షిపణి దాడులు, పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ అణు దాడుల గురించి ప్రస్తావించడం, ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఆర్మీ రాకెట్ ఫోర్స్‌ను ప్రకటించటం లాంటి పరిణామాల నేపథ్యంలో భారత్ ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.
దీంతో పాటు మన దేశానికి విస్తారమైన తీర ప్రాంతం ఉం డటం, పొరుగునున్న శత్రు దేశాల నుంచి ముప్పు పొంచి ఉండటం లాంటి కారణాలు రక్షణ, నిఘా వ్యవస్థలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పాయి. భారత్‌లో విస్తరిస్తున్న ఫైనా న్షియల్, టెక్నాలజీ హబ్‌లు, పారిశ్రామిక కారిడార్లకు కూడా శత్రువుల నుంచి ము ప్పు పొంచి ఉన్న విషయం తెలిసిందే.
శత్రు దళాలకు అధిక ప్రాధాన్యం గల లక్ష్యాలుగా ఉండే కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, ఆహారం, నీటి సరఫరా, రైల్వే, ఆసు పత్రులు, మతపరమైన ప్రదేశాలు, రక్షణ వ్యవస్థలు, విద్యుత్ గ్రిడ్‌లు వంటి కీలకమైన వ్యవస్థలు, సంస్థలకు సైనిక, సాంకేతి కపరమైన రక్షణ అవసరమని భావించి ముందుచూపుతో భారత్ ప్రారంభించిన మిషన్ సుదర్శన్ చక్ర భవిష్యత్తులో కీలకంగా మారనుందని చెప్పాలి. ఈ వ్యవ స్థకు ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టం, సొంత బహుళ పొరలు కలిగిన వాయు రక్షణ వ్యవస్థలు, త్రిగాన్ సిస్టం, అకాశ వీర్ నెట్‌వర్క్ లాంటి పలు వ్యవస్థలను అనుసంధానిస్తారు.
మారుతున్న యుద్ధ స్వభావం ఈ మొత్తం వ్యవస్థ అర్కిటెక్చర్ రూపకల్పనకు మార్గనిర్దేశం చేస్తుంది. దీనిలో బహుళ డొమైన్ ఇంటెలిజెన్స్, నిఘా, గూఢచార సమాచార సేకరణ, భూమి, వాయు, జల, అంతరిక్షంలోని సెన్సార్ వ్యవస్థల ఏకీకరణ అవసరం.
ఈ ప్రాజెక్టులో శత్రువు ఆయుధాలను గుర్తించడం, స్వాధీనం చేసుకోవడం, నిర్వీర్యం చేయడం కోసం మౌలి క సదుపాయాలు, విధానాలను రూపొందిస్తారు. అంతేకాదు, స్పష్టమైన చిత్రాల కోసం, కచ్చితమైన సమయ ప్రతిస్పందనలను అందించడానికి, భారీ మొత్తంలో డేటాను ఏఐ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, క్వాంటం కంప్యూటింగ్‌లను ఉపయోగించి విశ్లేషించాల్సి ఉంటుంది.
ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర దేశంలోని అన్ని నగరాలు, ప్రాంతాలను కాపాడటమే కాక ఆధునిక సాంకేతికతో అభివృద్ధి చెందుతున్న బహుముఖ ముప్పుల నుంచి దేశా నికి పూర్తి రక్షణ కల్పిస్తుంది. దీనికి శత్రు దురాక్రమణను ఆపటంతో పాటు శక్తివంతమైన ప్రతీకార దాడులను ప్రారంభించ గల సామర్థ్యం ఉంది.
ఇది భూమి, వాయు, సముద్రంలో ముప్పులను నివారించడానికి సహాయపడుతుంది. విమా నాలు, యుద్ధట్యాంకులు, యుద్ధనౌకల భద్రతను పెంచుతుంది. వ్యూహాత్మక ఆస్తు ల విధ్వంసం, హైబ్రిడ్ ముప్పు, సైబర్ వార్‌ఫేర్‌లను కూడా ఎదుర్కొంటుంది. మిషన్ సుదర్శన్ చక్ర రానున్న తరంలో సమీకృత నిఘాను అభివృద్ధి చేసే తిరుగులేని ప్రయత్నమని చెప్పక తప్పదు.
భారత్‌కు చెందిన ద్వీప భూభాగాలతో సహా దేశం మొత్తాన్ని దీనిలో అమర్చిన అత్యంత కచ్చితంగా గుర్తించగలిగే సెన్సార్ పొరల ద్వారా పర్యవేక్షించవచ్చు. అంతేకాదు, అంతర్జాతీయ సరిహద్దుకు ఆవల కనీసం 2,500 కిలోమీటర్ల వరకు కూడా దీనితో దృష్టి పెట్టవచ్చు.
ఏఐ కీలకపాత్ర పోషించడంతో, ఇది దేశవ్యాప్త రాడార్ల నెట్‌వర్క్, కమాండ్- అం డ్ -కంట్రోల్ కేంద్రాలు, ఇంటర్సెప్టర్ క్షిపణులు, సమీప, సుదూర శ్రేణి మానవ రహిత వైమానిక వ్యవస్థలను కలిగి ఉం టుంది. ఇవి దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లు, ఫిరంగి గుండ్లు, గుంపులుగా తిరిగే మందుగుండు సామగ్రిని గుర్తించి, ట్రాక్ చేసి, నాశనం చేయగలదు. ఈ వ్యవస్థ సు మారు 500 కిలోమీటర్ల వరకు డ్రోన్లు, మధ్య-, స్వల్ప-శ్రేణి క్షిపణులను గుర్తించి నాశనం చేస్తుంది.
ఇందులో స్వల్ప-శ్రేణి వైమానిక ముప్పులను ఎదుర్కోవడానికి వేగవంతమైన ప్రతిస్పందన రక్షణ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది డ్రోన్ లేదా క్షిపణి ప్రయోగాల మూలాలను ట్రాక్ చేస్తుంది. సుదర్శన్ చక్రతో సైన్యం, వైమానిక, నావికా దళాలు తమ వాయు రక్షణ సామర్థ్యాలను ఏకీకృతం చేస్తాయి. 2,500 కిలోమీటర్ల దూరం, 150 కిలోమీటర్ల ఎత్తు దీని పరిధిలో ఉంటుంది. ఇంకా అనే క ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఫీచర్లతో రూపొందిస్తున్న ఈ మిషన్ సుదర్శన్ చక్ర భారత్ రక్షణరంగ కిరీటంలో చేరనున్న మరో కలికితురాయి అని చెప్పక తప్పదు.
వ్యాసకర్త: రక్షణరంగ విశ్లేషకుడు






