12 April, 2026 | 2:12 AM

ఆబ్కారీ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలి

12-04-2026 12:51 AM

డిప్యూటీ కమిషనర్‌పై దూషణలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి డిమాండ్

నిజామాబాద్, ఏప్రిల్ 11(విజయక్రాంతి): నిజామాబాద్ డివిజన్ ఆబ్కారీ శాఖ డిప్యూటీ కమిషనర్ వి.సోమిరెడ్డిని అకారణంగా ఆ శాఖ కమిషనర్ దూషించడాన్ని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఓడనాల రాజశేఖర్ తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై మంగళవారం మీడియాతో మాట్లాడారు. తోటి అధికారి అని కూడా చూడకుండా పరుష పదజాలంతో దూషించిన కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

తీవ్రంగా అవమానపడ్డ డిప్యూటీ కమిషనర్ మానసిక ఒత్తిడితో ఆసుపత్రి పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. 30 ఏళ్లుగా ఆబ్కారీ శాఖకు సేవలందిస్తున్న అధికారిని పరుష పదజాలంతో దూషించడం ఏంటని నిలదీశారు. ఉద్యోగులను దూషిస్తూ వారి జీవితాలతో చెలగాటం ఆడుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. ఏదైనా తప్పిదం చేస్తే శాఖపరమైన చర్యలకు అధికారం ఉంటుందని గుర్తు చేశారు.

అనవస రంగా నోరు పాడేసుకోవద్దన్నారు. ఈ వ్యవహారంపై సంబంధిత శాఖ వెంటనే స్పం దించి ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలని, కమిషనర్‌ను తప్పించాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డిని, ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుని, సీఎస్‌ని కలిసి వెంటనే చర్యలకు డిమాండ్ చేస్తామన్నారు.