ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల దోపిడీని అరికట్టాలి
ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ మల్యాల రాజేష్
జగిత్యాల, జూన్ 18 (విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జగిత్యాల ఆధ్వర్యంలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిఈఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ పేద బడుగు బలహీన విద్యార్థులను అన్యాయానికి గురి చేస్తుంది. అంతేకాకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఎంఈఓ, డిఈఓ లు లేని కారణంగా ఉన్న ఇన్చార్జి డిఈఓ లు కనీసం పట్టించుకోకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు వత్తాసు పలకడం చాలా బాధాకరమని అన్నారు.
పాఠ్యపుస్తకాలను పాఠశాలలో అమ్ముతూ విద్యను పూర్తిగా వ్యాపారంగా మారుస్తున్నప్పటికీ అధికారులు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే మొద్దు నిద్ర వహిస్తుందని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంఈఓ, డిఈఓ మరియు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నందువల్ల ఎంతో మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సంబంధిత పోస్టులను భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే కుట్ర చేస్తుందని తెలిపారు నిర్ణయాలను వెనక్కి తీసుకొని ప్రభుత్వ పాఠశాలలను సాంఘిక సంక్షేమ హాస్టల్ లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి హాస్టల్లకు పక్కా భవనాలను నిర్మించాలన్నారు. అలాగే ఎన్ ఇ పి - 2020 తక్షణమే అమలు చేయాలని, అనుమతులు లేకుండా నడుస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకుని వాటి గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ మాడవేణి సునీల్, నగర కార్యదర్శి రాపాక నిఖిల్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజు, మారుతి కార్యకర్తలు ప్రణీత్ అజయ్ అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.






