‘రైతు డిస్కం’ నాటకం
- ఉచిత కరెంట్‌కు కోత పెట్టే ప్రయత్నం
- రేవంత్‌రెడ్డి మనసులో మాటను కోదండరెడ్డి బయటపెట్టారు
- ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు మాజీ మంత్రి హరీష్‌రావు
హైదరాబాద్, మే 29 (విజయక్రాంతి) : రైతులకు 24 గంటలు ఇస్తున్న ఉచిత కరెంట్‌కు కోత పెట్టే చర్యల్లో భాగంగాపూ రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు డిస్కం’ పేరుతో నాటకాలు ఆడుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. 3 గంటలు చాలు అని ఈఆర్‌సీ ముందు కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి వినిపించిన వాదనలు.. ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖాన్ని బట్టబయలు చేశాయని స్పష్టం చేశారు.
ఇది కోదండరెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదని, రేవంత్‌రెడ్డి మనసులోని ఆలోచన అని విమర్శించారు. అమెరికా వేదికగా రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయన్నారు. పొలం అంటే ఏమిటో, బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో, రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడుతాడో తెలియని వాళ్లు మాత్రమే 3 గంటల కరెంట్ చాలని మాట్లాడగలరని తెలిపారు.
దేశానికే ఆదర్శంగా నిలబెట్టాం
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి తెలంగాణ వ్యవసాయాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టిందని హరీష్‌రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ మాత్రం అదే రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రుణమాఫీ అటకెక్కించారు. రైతు బంధు బంద్ చేశారు. పంట బోనస్ బోగస్ చేశారు. ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయ్యారు. పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారు.
ఇవి చాలదన్నట్లు కేసీఆర్ గారు ఎంతో శ్రమించి అమలు చేసిన 24 గంటల కరెంట్ ను ప్రణాళిక ప్రకారం ఖతం పట్టిస్తున్నారు’ అని మండిపడ్డారు. రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా? అని ప్రశ్నించారు. కరెంట్ కోతలతో, రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ కుట్రలను యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తోందని, రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు.






