05-07-2025 01:49:39 AM
దేశంలో తొలిసారిగా కులగణన జరిగింది తెలంగాణలోనే
హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి) : తెలంగాణలో కులగణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని, వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు అమలయ్యేవరకు పోరాటం ఆగదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. పలు పథకాల అమలులో, బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు దేశంలో మొదటిసారిగా కులగణన నిర్వహించడంలో తెలంగాణ దేశానికే మోడల్‌గా నిలిచిందని ఆయన అన్నారు.
రాజ్యాం గం నుంచి లౌకిక, సామ్యవాద పదాలను తొలగించాలని బీజేపీ చూస్తోందని ఆయన ఆరోపించారు. సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు రాజ్యాంగంలో లేనేలేవని బీజేపీ, ఆర్‌ఎస్ ఎస్ చెబుతున్నాయని, ధైర్యముంటే బీజేపీ రాజ్యాంగం నుంచి ఆ పదాలను తొలగించాలని ఖర్గే సవాల్ విసిరారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్‌లో భాగంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సామాజిక న్యాయ సమర భేరీ సభలో ఆయన ప్రసంగించారు.
ఆర్‌ఎస్‌ఎస్, మోదీ, అమిత్ షా సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించలేరని ఆయన పేర్కొన్నారు. బీజేపీ తన పార్టీ ప్రణాళికలో మాత్రం సెక్యులర్, సోషలిస్ట్ పదాలతో సహా రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసాన్ని కలిగి ఉంటామని రాసుకుందన్నారు. సెక్యులర్ అనే పదంతో ఇబ్బంది ఉంటే బీజేపీ ప్రణాళిక నుంచి తొలగించే చూపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ హయాం లో తెలంగాణ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం అత్యంత అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులను కేసీఆర్ నిలువునా మోసం చేశారని ఖర్గే మండిపడ్డారు.
తెలంగాణకు నరేంద్ర మోదీ, అమిత్ షా చాలా చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని.. కానీ, అసలు వాళ్లు ఈ దేశానికి, తెలంగాణ చేసిందేమిటని ప్రశ్నించారు. ఇప్పటికి మోదీ 42 దేశాలు తిరిగారని.. కానీ ఇంతవరకూ మణిపూర్ వెళ్లడానికి మాత్రం ఆయనకు మనసు రావట్లేదని అన్నారు.
ముందు దేశ ప్రజల బాధలు వినండి.. తర్వాత విదేశాల సంగతి చూడవచ్చని హితవు పలికారు. రాహుల్ గాంధీ, తాను కలిసి స్వయంగా మణిపూర్ వెళ్లి పరిస్థితులను తెలుసుకున్నామని గుర్తుచేశారు. మోదీ విదేశాంగ విధానం సరిగ్గా లేదని, తప్పుడు విధానంతో అందరినీ శత్రువులుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు.
కార్యకర్తల కృషితో..
కార్యకర్తల కృషితోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఖర్గే పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మంత్రులు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేశారని కితాబునిచ్చారు. కేసీఆర్, బీజేపీ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ర్టంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని భ్రమ పడ్డారని, కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి మిగతా పార్టీలను ఓడించి తమను అధికారంలోకి తెచ్చారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే అన్నివర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు. కార్యకర్తలు కాంగ్రెస్ ఆత్మ అని.. వారి వల్లే రాష్ర్టంలో అధికారం దక్కిందని పేర్కొన్నారు.
బీజేపీ చేసిందేమీ లేదు..
హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం ఉన్నాయని.. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే అవి వచ్చాయని ఖర్గే అన్నారు. హైదరాబాద్‌లో కనీసం 50 కేంద్ర ప్రభుత్వ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చాయని.. మోదీ చేసింది ఏంటో బీజేపీ చెప్పాలన్నారు. మోదీ ప్రధాని అయ్యాక గత 11 ఏళ్లలో ఏం తెచ్చారని ప్రశ్నించారు. విదేశాల నుంచి నల్లధనం తెచ్చి ప్రతి వ్యక్తికి రూ.15 లక్షలు ఇస్తానని మోదీ అన్నారని..
ఇంతవరకు ఎందుకు ఒక్క రూపాయి కూడా ఖాతాల్లో పడలేదని ప్రశ్నించారు. ఫ్రీ కరెంట్, ఉచిత బస్సు, సన్న బియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుంచుకో వాలన్నారు. గత ప్రభుత్వం అమ్మే బియ్యం ఇచ్చేదని.. కాంగ్రెస్ ప్రభుత్వం తినే బియ్యం ఇస్తోందని తెలిపారు.
తెలంగాణ దేశానికి ఆదర్శం కాబోతుందని.. తాము చెప్పినవన్నీ ఇచ్చి చూపించామని వెల్లడించారు. అబద్ధాలు చెప్పి కొందరు ఓట్లు అడుగుతారని.. తాము అభివృద్ధి, సంక్షేమం చేసి చూపెట్టి ఓట్లు అడుగుతామని తెలిపారు. తెలంగాణలో విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టాన్ని తెస్తున్నామని తెలిపారు.
మోదీ యుద్ధాన్ని ఆపారెందుకు..
పహల్గాంలో సంఘటన జరిగితే అన్ని పార్టీలు కేంద్రానికి మద్దతు ఇచ్చాయని.. ఈ సంఘటనపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తే ఆ సమావేశంలో మోదీ పాల్గొనలేదని ఖర్గే తెలిపారు. తామంతా దేశ సైనికుల కోసం చర్చించే సమయంలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని విమర్శించారు.
పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ పేరిట చేసిన దాడులను తాము సమర్థించామని.. ఇది చేస్తాం, అది చేస్తాం అని పాకిస్తాన్‌పై యుద్ధం ఎందుకు ఆపారని ప్రధానిని ప్రశ్నించారు. యుద్ధం చేయకుండా వారిని ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు.