ఇంద్రేశంను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం
పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్ చెరు, పిబ్రవరి 24: నూతనంగా ఏర్పడిన ఇంద్రేశం మున్సిపాలిటీని సమిష్టి సహకారం, సమన్వయంతో ఆదర్శంగా తీర్చిదిద్దుదామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని రామేశ్వరం బండ వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ తొలి పాలకవర్గ సమావేశానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డిల తో కలిసి ఎమ్మెల్యే జీఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులుగా పని చేసే అవకాశం కొద్ది మందికే లభిస్తుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే ఐదేళ్లపాటు ప్రతి వార్డుని ఆదర్శంగా తీర్చిదిద్దు కోవాలని కోరారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ఇంద్రేశం మున్సిపల్ అభివృద్ధికి ఇప్పటికే 15 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, అతి త్వరలో వీటికి సంబంధించిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం అందించే నిధులతో పాటు సి ఎస్ ఆర్ నిధులను సైతం అభివృద్ధి పనులకు కేటాయించబోతున్నట్లు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఇంద్రేశం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని కోరారు. అనంతరం నూతన పాలక వర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుశంగుల ప్రమీల, వైస్ చైర్మన్ పట్లొల్ల హరీష్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ అజయ్ రెడ్డి, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




