15 April, 2026 | 6:41 PM

దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పులిగుండాల ప్రాజెక్ట్‌

15-04-2026 04:16 PM
  1. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  2. పులిగుండాల ప్రాజెక్ట్ పరిసరాల్లో కాటేజీల నిర్మాణానికి 4 కోట్లు మంజూరు
  3. కనకగిరి హిల్స్ అభివృద్ధి పనులు తక్షణమే ప్రారంభించాలి
  4. పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్ ను ప్రారంభించి, పరిశీలించిన డిప్యూటీ సీఎం, పొంగులేటి

పెనుబల్లి,(విజయక్రాంతి): పెనుబల్లి మండలం బ్రాహ్మళ్లకుంట గ్రామంలోని పులిగుండాల ట్యాంక్ వద్ద ఏర్పాటు చేసిన పులిగుండాల ప్రాజెక్ట్‌ను దేశంలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్ ను ప్రారంభించి పరిశీలించారు. ఈ సందర్భంగా బోటింగ్, వాటర్ ఫాల్స్, జంగిల్ సఫారీ లను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎకో టూరిజం అభివృద్ధిని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, తెలంగాణలోని ప్రకృతి సౌందర్యాలను ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. కనకగిరి హిల్స్ అభివృద్ధిని తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పులిగుండాల ప్రాజెక్ట్ నీటి పరిసర ప్రాంతాల్లో రెండు వైపులా కాటేజీల నిర్మాణానికి 4 కోట్లు సిఎస్ఆర్ నిధుల నుండి మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక రంగాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో పులిగుండాల ప్రాజెక్ట్‌ను దేశంలోని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో ఒకటిగా అభివృద్ధి చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.

ఖమ్మం జిల్లా అభివృద్ధి మా అందరి లక్ష్యం: పొంగులేటి

ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేయడమే మా అందరి లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. కనకగిరి హిల్స్ వంటి అందమైన ప్రాంతాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎకో టూరిజం క్రింద రాష్ట్రంలో టాప్ 3 గమ్యస్థానాలలో ఒకటిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.

ఏకో టూరిజం ప్రారంభించడం సంతోషంగా ఉంది: ఎమ్మెల్యే రాగమయి

కనకగిరి హిల్స్‌కు ఎకో టూరిజం క్రింద నిధులు, నీలాద్రి హిల్స్‌కు దేవాలయ పర్యాటక అభివృద్ధి క్రింద నిధులను డిప్యూటీ సీఎం, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంజూరు చేయడం జరిగిందని, ఏకో టూరిజం ప్రారంభించు కోవడం చాలా సంతోషంగా ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. మన చుట్టూ ఉన్న అందమైన ప్రకృతిని కాపాడేందుకు అధికారులు ఎంతో శ్రమిస్తున్నారని తెలిపారు. పులిగుండాల ఎకో టూరిజం ప్రాజెక్ట్ ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, మన సంస్కృతి, వారసత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసిఎఫ్ సువర్ణ, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సిపి సునీల్ దత్, వైరా ఎమ్మెల్యే రాందాస్  నాయక్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ భీమా నాయక్, జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.