2 September, 2026 | 1:19 AM

అగ్నిపర్వతంపై అడుగిడిన తొలి మహిళ

08-06-2024 | 01:39am

కరీంనగర్ మహిళ పర్వీన్ సుల్తానా రికార్డు

కరీంనగర్, జూన్ 7 (విజయక్రాంతి): భారతదేశ చరిత్రలో మరో అరుదైన ఘటన ఆవిష్కృతమైంది. మన దేశంలోని ఒకేఒక అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవుల్లోని బెరన్ ఐలాండ్‌లో ఉంది. ఆ అగ్నిపర్వంతపై మొదటిసారిగా ఇద్దరు మహిళలు అడుగుపెట్టడం ద్వారా ప్రపంచ చరిత్రలో అగ్నిపర్వతంపై అడుగుపెట్టిన మహిళలుగా చరిత్రకెక్కారు. ఆ ఇద్దరిలో ఒకరు కరీంనగర్ నగరానికి చెందిన మహ్మద్ పర్వీన్ సుల్తానా. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సెస్, డెహ్రాడూన్, ఇస్రో వారి ప్రత్యేక పరిశోధన ప్రాజెక్టులో భాగంగా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మమతా చౌహాన్ సారథ్యంలో వివిధ రంగాల పరిశోధకుల బృందంలో ఒకరిగా కరీంనగర్ నగరంలోని కోతిరాంపూర్‌కు చెందిన మహమ్మద్ పర్వీన్ సుల్తానా పాల్గొన్నారు. వీరి పరిశోధనలో భాగంగా అగ్నిపర్వతం భౌగోళిక పరిణామాలు, శాస్త్రీయ విశ్లేషణ, అగ్ని పర్వత పనితీరు, అగ్నిపర్వత ప్రకృతి విపత్కర పరిస్థితులపై అంచనా, అవగాహన కోసం అక్కడ లభించిన వివిధ రకాల నమూనాలను సేకరించారు. అండమాన్‌లోని డిగ్లీపూర్ నుంచి రంగౌత్ వరకు సుమారు వంద కిలోమీటర్లకుపైగా వివిధ ప్రాంతాల్లో ఉన్న అగ్నిపర్వతాలను పరిశీలించి నమూనాలు సేకరించారు.