calender_icon.png 9 May, 2025 | 10:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేట మొదలు

24-04-2025 01:51:36 AM

ఉగ్రదాడిపై ఆగ్రహ జ్వాలలు

చిక్కిన టీఆర్‌ఎఫ్ కీలకనేత!

ఉరి వద్ద ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టిన భద్రతా దళాలు

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: పహల్గాం ఉగ్రదాడితో భారత భద్రతాదళాలు ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాయి. బుధవారం సాయంత్రం భద్రతాదళాలు జమ్మూలోని కుల్గాం జిల్లా తంగ్‌మార్గ్ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతుండగా.. ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్) టాప్ కమాండర్ భద్రతా దళాలకు చిక్కినట్టు తెలుస్తోంది.

మంగళవారం పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది తామే అని టీఆర్‌ఎఫ్ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం తెల్లవారుజామున ఉరి నాలా వద్ద సర్జీవన్ అనే ప్రదేశంలో భారత్‌లో ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ఉగ్రవాదులను సైన్యం గుర్తించి కాల్పులు జరపగా.. ఇద్దరు మరణించారు. వారి వద్ద భారీగా మందుగుండు సామగ్రి, ఆయుధాలు, పాక్ కరెన్సీని భద్రతా బలగాలు స్వాధీనపరుచుకున్నాయి.

ఆ ముష్కరులు వీరే..

పహల్గాంలో టూరిస్టులపై కాల్పులు జరిపింది ఈ ముష్కరులే. వీరు ఆసిఫ్ ఫౌజి, సులేమాన్ షా, అబు తాలా అని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. మూసా, యూనిస్, ఆసీఫ్ అనే కోడ్‌నేమ్‌లు కూడా వీరికి ఉన్నాయి. ఆయుధాలతో ఉన్న నలుగురు ఉగ్రవాదుల ఫొటోను విడుదల చేశాయి. ఈ ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్ కేంద్రంగా పనిచేసే ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’లో సభ్యులు. ఉగ్రదాడి నుంచి బయటపడిన ప్రత్యక్ష సాక్షులు చెప్పిన ప్రకారం దర్యాప్తు సంస్థలు ముగ్గురు ఉగ్రవాదుల స్కెచ్‌లను కూడా విడుదల చేశాయి.