19-12-2025 12:56:46 AM
కామారెడ్డి, డిసెంబర్ 18 (విజయక్రాంతి): కామరెడ్డి జిల్లా అడవిశాఖ కామారెడ్డి,మాచారెడ్డి రేంజ్ డివిజన్ శాఖ అధికారులు అత్యవసర ప్రజా హెచ్చరిక నోటీసులు గురువారం జారీ చేశారు. మాచారెడ్డి అడవి క్షేత్ర పరిధిలోని అటవి ప్రాంతంలో పరిసర వ్యవసాయ క్షేత్రాలలో పెద్దపులి సంచారం నిర్ధారణ అయిందని. మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ, బీబీపేట్, పాల్వంచ, బిక్కనూర్, మండలాల ప్రజలు అత్యంత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమైన భద్రత సూచనలు తప్పకుండా పాటించాలని హెచ్చరించారు.
తదుపరి నోటీసు వచ్చేవరకు అడవి ప్రాంతంలోకి ప్రజలు వెళ్లవద్దని సాయంత్రం ఐదు నుండి ఉదయం ఏడు గంటల వరకు వ్యవసాయ పొలాల్లోకి వెళ్ళవద్దని ప్రజలు ఎవరు సంచరించవద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. రాత్రి వేళల్లో పశువులను వ్యవసాయ క్షేత్రంలో వదిలిపెట్ట వద్దన్నారు. పగటిపూట వ్యవసాయ క్షేత్రాలకు ఒంటరిగా వెళ్లవద్దని అటవి శాఖ అధికారులు సూచించారు.
వ్యవసాయ క్షేత్రాలలో పులి గాని, దాని పాదముద్రలు గాని, పశువులపై దాడి గాని జరిగినట్లు తెలిస్తే వెంటనే అటవిశాఖ ,పోలీస్ శాఖలకు సమాచారం అందించాలని సూచించారు. పులి కి హానీ కలిగించే ప్రయత్నం చేయవద్దని విద్యుత్ కంచెలు, కుచ్చులు, విష ప్రయోగం ద్వారా పులికి హాని కలిగించవద్దని హెచ్చరిక నోటీస్ అటవీశాఖ అధికారులు సూచించారు. అత్యవ సర సమాచారం కోసం 8555830266, 9490411547, 7981949524 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని అడవిశాఖ ప్రజా హెచ్చరిక నోటీసులు సూచించింది.