వినమరుగైన కావ్యం పానశాల
దువ్వూరి రామిరెడ్డి - కవి :
‘అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల, విశ్రాంతి గృహంబు, నందు నిరుసంజలు రంగుల వాకిళుల్, ధరాక్రాంతులు పాదుషాలు, బహ రామ్ జమిషీడులు వేనవేలుగా కొంత సుఖించి పోయిరెటకో పెరవారికి చోటొసంగుచున్’ అంటాడు -కవికోకిల దువ్వూరి రామిరెడ్డి.
తెలుగు సాహిత్యంతో పరిచయమున్న ప్రతిఒక్కరికీ ఈ పద్యం తెలిసే ఉంటుంది. కవిత ఏదైనా సరే అందు లో గొప్పతనం ఉంటే, ఆ కవిత ప్రజల నాల్కలపై సదా నిలిచి ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పిన ఈ పద్యం పండిత పామరులకందరికీ సుపరిచితమైన పద్యం. హృద్యమైన ఈ పద్యంలో కవి అస్థిరమైన మానవ జీవి తం గురించి విశదీకరించారు. ఇందులోని ఉపమానం అనుపమానం. నడక మనోహరం. సారాంశం వేదాంతం. ఇంతకీ.. ఆ పద్యం భావమేమిటంటే..
‘ఈ ప్రపంచం ఆది అంతమూ తెలియని ఒక పురాతన పాం థశాల, అంటే.. సత్రం. పూర్వ సంధ్య, అసుర సంధ్య అనేవి రెండు వాకిళ్లు. వేలకొలది రాజులూ, చక్రవర్తులూ ఈ సత్రంలో కొంతకాలం సుఖాలనుపొంది, ఆపై ఇతరులకు ఆ అవకాశం ఇస్తూ తాము ఎక్కడికో వెళ్లిపోయారు.. అనేది కవితలోని భావం. ఈ భూమిమీద శాశ్వతంగా ఉండేవాళ్లు ఎవరూ లేరు. అందువలన వున్న కొద్దికా లం వివాదాలు లేకుండా స్నేహంగా జీవించాలి’.
జీవన సత్యాన్ని ఇంత చక్కగా తెలియజేసే ఈ పద్యాన్ని రచించిన కవిని గురించి, ఈ పద్యం ఉండే కావ్యాన్ని గురించి తప్పక తెలుసుకోవాలని ప్రతిఒక్కరికీ అనిపిస్తుంది. ఈ పద్యాన్ని రచించినది దువ్వూరి రామిరెడ్డి. ఆ కావ్యం పేరు ‘పానశాల’.
మనం 21వ శతాబ్దంలోకి ప్రవేశించి, అప్పుడే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ సందర్భాన 20వ శతాబ్దంలోని మహాకవులను గురించి, వారి కా వ్యాలను గురించి ఒక్కమారు సింహావలోకనం చేసుకొనవలసిన అవసరం ఎం తైనా ఉంది. ఎందరో మహాకవులు.. అందరికీ వందనాలు. ‘పురుషులందు పుణ్యపురుషులు వేరయా’ అని మహాకవి వేమన అన్నట్లుగా --‘కవులలో కూడా మహాకవులు వేరయా’ - అని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది.
అలాంటి మహాకవుల కోవకు చెందినవారే దువ్వూరి. ఆయన ఏపీలోని నెల్లూరు జిల్లా గూడూ రులో 09 సెప్టెంబర్ 1895న జన్మించారు. హేతువాద భావాలుగల వీరు మా నవ ప్రయత్నంతో దేన్నైనా సాధించవచ్చనే గట్టి నమ్మకం ఉన్నవారు. ఆ నమ్మకంతోనే కృషీవలుడుగా ఉండిన వీరు, సాహితీ కృషీవలుడుగానూ మారా రు. 23 ఏళ్ల వయస్సులోనే ఆయన ‘రసికజనానందము’, ‘స్వప్నాశ్లేషము’, ‘అహల్యానురాగాలు’, ‘కృష్ణ రాయబారము’ అనే ప్రబంధాలు, ‘నలజారమ్మ’ అనే కావ్యము, ‘కర్షక విలాసం’ అనే నాటకం, మాతృశతకం అనే రాయగలిగారు.
వీరిని పండితులంతా ‘సింహపురి సిరి’గా కొనియాడతారు. స్వయంకృషితోనే అనేక భాషల్లో పాండిత్యం సంపాదించారు. వీరి కవిత్వం పాత కొత్తలకు మేలుకలయికగా అందాలు అలవరచుకుంది. శ్రమజీవియైన కర్షకుని జీవితం కూడా కవితా వస్తువేనని వీరు ‘కృషీవలుడు’ అనే ప ద్యకావ్యమును 1924లో రచించారు. సీఆర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఒక సభలో 1917లో నిర్వాహకులు స్వర్ణపతకం బహూకరించారు. 1918లో వీరు రాసిన ‘వనకుమా రి’ కావ్యం విజయనగర మహారాజు ఆస్థానంలో కావ్యస్పర్థలో, అంటే కావ్యాల పోటీ ల్లో ప్రథమ స్థానాన్ని సాధించింది.
వీరు ఇంకా ‘జలదాంగన’, ‘యువకస్వప్నము’, ‘కడపటి వీడుకో లు’, ‘సీతావనవాసం’, ‘కుంభ రాణా’, ‘మాధవ విజయం’ అనే నాటకాలు కూడా రచిం చారు. దువ్వూరి ౧926లో ‘పానశాల’ అనే అనువాద గ్రంథాన్ని ప్రారంభించారు. ఈ పానశాల కావ్యం 1928లో సాహి త్య మాసపత్రిక ‘భారతి’లో అచ్చయింది. 1929లో విజయవాడలోని ఆంధ్రమహాసభ వారు వీరికి ‘కవికోకిల’ బిరుదు ప్రదానం చేశారు. ఉమర్‌ఖయ్యూం అనే మహాకవి పారశీక భాషలో రచించిన ‘ఉమర్ ఖయ్యామ్ రుబాయతులే’ ఈ కావ్యానికి మూలం.
‘గడచిపోయిన కాలం తిరిగిరాదు.. రాబోయే కాలం అనేది అసలు ఉందో లేదో సందేహం.. ఇప్పుడుండే ఈ వర్తమాన కాలంలోనే సుఖాలను అనుభవించాలి’ అని చెప్పే ఉమర్ ఖయ్యూం స్ఫూర్తితో కావ్యం రూపుదిద్దుకున్నది. దువ్వూరి 11 సెప్టెంబర్ 1947న పరమపదించారు. ఈ ‘పానశాల’ గ్రంథాన్ని నేను ౩౫ క్రితం కొని చదివాను. చదవాలి అనిపించినప్పుడల్లా మరలామరలా, అనేక పర్యాయాలు చదివాను.
కొంతకాలం విరామం తరువాత మరలా ఇప్పుడు చదువుతూంటే, వ్యాసం ఆరంభంలో ఉటంకించిన పద్యం దగ్గరకొచ్చేటప్పటికి (దీని గురించి మీకందరికీ ముందే తెలుసో లేదో తెలియదు. అయినా సరే గానీ) మీతో కొన్ని విషయాలు చెప్పాలనిపించింది. అందుకే ఓపిక తెచ్చుకుని నా భావాలను ఇలా (టైపింగ్ చేస్తూ) వ్యక్తపరిచాను. ఇంకో విషయం ఏమిటంటే.. దీనిని ‘అమర్ ఖయ్యూం’ అనే పేరుతో డాక్టర్ జంధ్యాల పాపయ్యశాస్త్రి పద్య కావ్యంగా చాలా అద్భుతంగా రాశారు. ఆ ప్రతిని కూడా ఒక గ్రంథాలయంలో చూశాను.
నేను కొందామంటే నెల్లూరులో దొరకలేదు. అందుకని గ్రంథాలయంలో కూర్చొని నాలుగు రోజులపాటు కూర్చుని నోట్‌బుక్‌లో ఎత్తి రాసుకున్నాను. దానిని అనేకసార్లు చదివాను. టీచరుగా పనిచేస్తున్నప్పుడు పాఠ్యాంశాల బోధనలో సందర్భోచితంగా మధ్యమధ్యలో విద్యార్థులకు ఈ రెండు కావ్యాల్లోని సంఘటనలను పద్యాల్లో సహా ఉదాహరించి, భావాన్ని విడమరచి చెప్పేవాడిని.
ఇంకా బయట నేను ఇచ్చే అనేక ప్రసంగాల్లోనూ వీటిని ఉదాహరిస్తూంటాను. మీరు ఇంత ఓపికగా, ఆసక్తిగా చివరిదాకా చదివారంటే.. ఇది మీకెంతగానో నచ్చిందనుకుంటాను. చాలా చాలా సంతోషం. వీలైతే.. కాదుకాదు.. వీలుచేసుకొని మరీ ఈ కావ్యాలను కొంటారో, సేకరిస్తారో మీ ఇష్టం. కానీ, తప్పకుండా చదవమని నా అభ్యర్థన. ధన్యవాదాలతో !
వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత ఉపాధ్యాయుడు
(సోషల్ మీడియా నుంచి సేకరించిన వ్యాసమిది)






