ప్రైవేట్ బిల్లు డైవర్ట్ చేసేందుకే ‘ఫార్ములా’ కేసు
- ఇది ముమ్మాటికీ లొట్ట పీసు కేసే
- నాపై కక్షతో అధికారులను వేధించడం సరికాదు
- ఎన్ని కుట్రలు చేసినా ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించే అంశాన్ని వదిలిపెట్టం
- డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం
- టీడీఆర్ పెద్ద కుంభకోణం
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై బీఆర్‌ఎస్ తెస్తున్న ప్రైవేటు బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మళ్లీ తెరపైకి ఫార్ములా ఈ కేసు చార్జిషీట్ తెచ్చారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సీఎం సంతకం చేసిన తొలి ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్‌ఎస్ బయటపెట్టడంతో సర్కారు పూర్తిగా ఇరకాటంలో పడిందన్నారు.
తాను మొదటినుంచి చెబుతున్నట్టు ఇది ముమ్మాటికీ లొట్ట పీసు కేసేనని మండిపడ్డారు. ఇందులో ఏమీ లేదని ప్రభుత్వమే చార్జిషీట్‌లో ఒప్పుకుందని, ఇక్కడి బ్యాంకు నుంచి పంపిన రూ.45 కోట్ల నిధులు అక్కడి బ్యాంకు అకౌంట్‌లో భద్రంగా ఉన్నాయని స్పష్టం చేశారు. తెలంగాణ నుంచి పంపిన నిధులు ఎక్కడా దారి మళ్లలేదని, ప్రభుత్వం గోరంతలను కొండంతలు చేసే ప్రయత్నం చేస్తుందన్నారు.
మంగళవారం అసెంబ్లీలో మీడియాతో కేటీఆర్ చిట్‌చాట్ నిర్వహించారు. ఇక్కడి నుంచి రూ.45 కోట్లు పంపితే రూ.600 కోట్లని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని, ఇలాంటి అభూత కల్పనలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పారు. అసలు ఈ కేసులో ఎవరికి అనుచిత లబ్ధి చేకూరిందని ప్రభుత్వం ఆరోపిస్తుందో వారి పేరే చార్జి షీట్‌లో లేదన్నారు.
ఈ రేసు వల్ల ఆ వారం రోజుల వ్యవధిలోనే దాదాపు 700 కోట్ల ఆర్థిక ప్రయోజనం రాష్ట్రానికి కలిగిందని నీల్సన్ అనే సంస్థ స్పష్టం చేసిందన్నారు. తనను లైంగికంగా వేధించారని మిస్ యూకే చేసిన ఆరోపణలతో రాష్ట్రం పరువు పోయిందని, అంత దారుణం జరిగినా ప్రభుత్వం ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై కేసు నమోదు చేయలేదని విమర్శించారు. ఎలాంటి తప్పు జరగని ఫార్ములా రేసు కేసు కోర్టులో నిలబడదని, ఇదంతా దృష్టి మళ్లించడానికి మళ్లీ రాద్ధాంతం చేస్తున్నారని ప్రజలకు అర్థమైపోయిందన్నారు.
న్యాయస్థానాలపై సంపూర్ణ నమ్మకం ఉందని, తప్పకుండా ఫార్ములా ఈ రేసులో చివరికి న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తనపై రాజకీయ కక్షతో అధికారులను వేధించడం సరైనది కాదన్నారు. ప్రభుత్వం ఎన్ని అటెన్షన్ డైవర్షన్ కుట్రలు చేసినా ఆరు గ్యారెంటీలకు చట్ట బద్దత కల్పించే అంశాన్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.
డీలిమిటేషన్‌ను స్వాగతిస్తున్నాం
కాంగ్రెస్ పార్టీ మూసీ అభివృద్ధిపైన ప్రణాళిక లేకుండా ముందుకు పోతున్నదని, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర రూపాయి డబ్బులు లేవు, ప్రణాళిక లేదని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టుకు సంబంధించిన మా పార్టీ లైన్, అభిప్రాయాన్ని మొన్న గండిపేటలో జరిగిన పబ్లిక్ పాయింట్ పీపీటీ ప్రెజెంటేషన్‌లోనే సమగ్రంగా చెప్పామని, కావాలంటే తమ పార్టీ తరఫున ఆ రోజు ప్రజలకు ఇచ్చిన ప్రెజెంటేషన్‌ను మంత్రులకు కూడా ఇస్తాము, మాకు ఇబ్బంది ఏమీ లేదన్నారు.
లక్షలాది మంది మూసీ బాధితులు భయకంపితలైన ప్రజలతో ప్రభుత్వం చర్చలు జరపాలని, ప్రజలను ఒప్పించి మూసీ ప్రాజెక్టు చేపడితే బాగుంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో పని చేసేవాళ్లు, ఉన్నత పదవుల్లో ఉన్న అధికారులు సైతం ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారని, మేధా పాట్కర్ లాంటి మేధావులు సైతం, గంటా చక్రపాణి లాంటి వారు కూడా ఈ మూసీ ప్రాజెక్టు ప్రజల అభిష్టం మేరకు జరగాలని కోరుతున్నారని చెప్పారు.
డీలిమిటేషన్ 2014లోనే జరగాలని, ఇప్పుడు జరిగినా స్వాగతిస్తామన్నారు. అయితే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే దక్షిణ భారతదేశానికి తీవ్రమైన నష్టం జరుగుతుందని, కాబట్టి గతంలో 1971 జనాభా లెక్కల ప్రకారం ఏ విధంగా చేశారో, అదే విధంగా ప్రస్తుతం ఉన్న నిష్పత్తిలోనే డీలిమిటేషన్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు కూడా పెంచడాన్ని స్వాగతిస్తున్నామని, అసెంబ్లీ సీట్లు పెంచితే ఎక్కువ మంది ప్రజా ప్రతినిధులు ఉండటం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రభుత్వాలు ప్రజలకు మరింత చేరువ అవుతాయన్నారు. అశ్వారావుపేట లాంటి దగ్గర లక్షా ముప్పు వేల ఓట్లే ఉంటే, శేరిలింగంపల్లి దగ్గర తొమ్మిది లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి ఇంత భారీ వ్యత్యాసం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.
టీడీఆర్ పెద్ద కుంభకోణం
రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులు, రేవంత్‌రెడ్డి అనుచరులు టీడీఆర్‌ని అడ్డగోలుగా కొనుగోలు చేస్తూ భారీ స్కామ్‌కి తెరలేపబోతున్నారని ఏడాదిన్నర క్రితమే స్పష్టంగా చెప్పానని గుర్తు చేశారు. బలవంతంగా టీడీఆర్‌లు కొనుగోలు చేసేలా రియల్ ఎస్టేట్ సంస్థలకు నిర్దేశిస్తూ కొత్త రియల్ ఎస్టేట్ నిబంధనలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.
మా ప్రభుత్వం తిరిగి వచ్చిన తర్వాత ఈ టీడీఆర్ కుంభకోణం పైన సమగ్ర విచారణ చేపిస్తామని, ఈ టీడీఆర్ ద్వారా నిర్వాసితుల దగ్గర నుంచి అతి తక్కువకు కొనుగోలు చేసి అడ్డగోలుగా అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు, బంధు మిత్రుల పాత్రను బయటపెడతామని హెచ్చరించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలనలో టీడీఆర్ అంటే ‘తిరుపతిరెడ్డి డెవలప్మెంట్ రైట్స్‘ అయిపోయాయని ఎద్దేవా చేశారు.
ఎవరెవరి చేతుల్లో ఏ విధంగా టీడీఆర్‌లు మారుతున్నాయి, ఎందుకు మారుతున్నాయి అన్న ప్రతి అంశం మాకు తెలుసునని, రేవంత్ రెడ్డి ఈ టీడీఆర్‌ను తన కుటుంబానికి ఒక ఏటీఎంలా మార్చుకున్నారని, త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి ఈ స్కామ్ ని పూర్తిగా బయటపెడతామని స్పష్టం చేశారు.




