వ్యాపారులపై ‘గ్యాస్ బండ’
ఒక్కో సిలిండర్‌పై రూ.42 వడ్డన
న్యూఢిల్లీ, జూన్ 1: హోటళ్లు, రెస్టారెంట్లలో ఉపయోగించే వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ ధరలను సోమవారం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరోసారి పెంచింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌పై రూ.42 పెంచింది. అయితే కోల్‌కతాలో ఈ పెంపు రూ.53.50 గా ఉంది. ఇక ఐదు కేజీల ఫ్రీట్రేడ్ ఎల్పీజీపై రూ.11 చొప్పున పెంచారు. గృహ వినియోగ(డొమెస్టిక్ ) సిలిండర్ల ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.
అయితే దేశంలో సహజంగా ప్రభుత్వ రంగంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం రిటైల్ ధరలను ఏకకాలంలో ప్రకటిస్తాయి. దీంతో ఇతర సంస్థల గ్యాస్ ధరల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంది. ఈ ధరల పెంపుతో ఢిల్లీలో ఒక్క వాణిజ్య ఎల్పీజీ 19 కిలోల సిలిండర్ ధర రూ.3,071.50 నుంచి రూ. 3,113.50కి పెరిగింది. హైదరాబాద్‌లో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3,294కు చేరుకుంది.
అలాగే చెన్నైలో రూ.3,232కు చేరింది. కాగా, కోల్‌కతాలో అధికంగా ఒక్కో వాణిజ్య సిలిండర్‌పై రూ.53.50 మేర పెరిగింది. దీంతో కోల్కతాలో వాణిజ్య సిలిండర్ ధర రూ.3,255కు చేరింది. గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులూ లేవు.






