2 August, 2026 | 1:02 AM

ఆయన ఇచ్చిన గిఫ్ట్.. నా లైఫ్‌లో నిశ్శబ్ద పాఠం!

02-08-2026 12:00 AM

‘ఇతరులను ఆకర్షించే క్రమంలో మనల్ని మనం కోల్పోతాం. కానీ, మనం వేసుకున్న నకిలీ ముసుగులను తీసేసి మనలా మనం ఉండటమే జీవితంలో నిజమైన ఎదుగుదల’ అంటోంది టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా. ఉన్నట్టుండీ ఈ ముద్దుగుమ్మ వ్యక్తిత్వం గురించి చెప్తుండటం ఏంటి? అనుకుంటున్నారా?! ఈ చిన్నది ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధర్మన్’చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ మూవీ షూటింగ్ సెట్స్‌లో తాజాగా రజినీకాంత్‌తో తనకు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటనను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. “షూటింగ్ గ్యాప్‌లో ఒకరోజు మేమిద్దరం మాట్లాడుకుంటున్న సమయంలో ఆధ్యాత్మికత గురించి చర్చ వచ్చింది. ఆ సమయంలో రజినీకాంత్ ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ అనే పుస్తకం పేరు చెప్పి, ఈ బుక్ ఎప్పుడైనా చదివావా? అని అడిగారు.

దానికి నేను లేదు అని చెప్పడంతో, రజినీకాంత్ మాట వరుసగా వదిలేయకుండా.. రెండు రోజులకే ఆ పుస్తకాన్ని స్వయంగా కొని తెచ్చి తనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. రజినీ సర్ ఈ పుస్తకాన్ని నాకు ఇవ్వడమే కాదు, ‘దీనిపై నిన్ను ఆ తర్వాత ప్రశ్నలు కూడా అడుగుతాను’ అని చెప్పారు. ఆయన ఎక్కడ టెస్ట్ పెడతారో అని గత కొన్ని వారాలుగా ఈ పుస్తకాన్ని ఎంతో శ్రద్ధగా, క్రమం తప్పకుండా చదువుతున్నా. నిజానికి ఈ బుక్ చదవడం నాకెంతో నచ్చింది.

చదువుతున్న కొద్దీ కొన్ని పేజీలు నన్ను ఆలోచింపజేస్తున్నాయి. ఈ పుస్తకం చదవడం వల్ల ఒక గొప్ప జీవిత సత్యాన్ని కూడా నేను నేర్చుకున్నా. మనల్ని ఎవరో మెచ్చుకోవాలని, ఇతరులను ఆకట్టుకోవడం కోసం వేరే వాళ్లలా నటించడం మొదలుపెడతాం. అలా ఏళ్ల తరబడి ఇతరుల కోసం జీవిస్తూ మ న అసలు వ్యక్తిత్వాన్ని కోల్పోతాం.

అందుకే ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దం మనల్ని భయపెడుతుంది. జీవితంలో నిజమైన ఎదుగుదల అంటే కొత్తగా ఏదో అయిపోవడం కాదు, మనం వేసుకున్న నకిలీ ముసుగులను తీసేసి మనలా మనం ఉండటమే అని ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నా. రజినీకాంత్ ఇచ్చిన ఈ గిఫ్ట్ నా జీవితంలో ఒక నిశ్శబ్ద పాఠం లాంటిది” అని తెలిపింది రాశీ.