08-12-2025 10:27:30 PM
*వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
హనుమకొండ (విజయక్రాంతి): అవినీతి రహిత సమాజం ఏర్పాటు చేయడం మన అందరి లక్ష్యమని వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. అవినీతి వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని సోమవారం హనుమకొండ అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి అశోక సెంటర్ వరకు జరిగిన ఈ అవగాహన ర్యాలీలో విద్యార్థులతో పాటు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఏసీబీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ అవినీతిని నిర్మూలించడం ద్వారా దేశాభివృద్ధి జరుగుతుందని, భవిష్యత్తులో అవినీతి నిర్మూలనలో విద్యార్థి, యువత పాత్ర చాలా కీలకమని, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్ కు సమాచారం అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య. ఇన్ స్పెక్టర్ రాజు ఇతర ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.
పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
అవినీతి వ్యతిరేక వారోత్సవాల కార్యక్రమాలలో భాగంగా సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అవినీతి వ్యతిరేక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అవినీతి నిర్మూలనలో ప్రతి పౌరుడు, ప్రతి ప్రభుత్వ ఉద్యోగి సమాన బాధ్యత వహించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేలా రూపొందించిన ఈ పోస్టర్లు, నైతిక విలువలు, పారదర్శకత, మరియు అవినీతి ఫిర్యాదుల కోసం అందుబాటులో ఉన్న మార్గాలను స్పష్టంగా చూపిస్తున్నాయన్నారు.
అవినీతి నిరోధక విభాగం ప్రజలందరినీ వారోత్సవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని కోరుతూ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి తాను చెయ్యాల్సిన పని చెయ్యటానికీ లంచం డిమాండ్ చేస్తే అట్టి సందర్భంలో ఏసిబి టోల్ ఫ్రీ నంబర్ 1064 కు లేదా ఇతర అధికారిక వేదికల ద్వారా నిర్భయంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఏసిబి డిఎస్పి, పి.సాంబయ్య, ఇన్స్పెక్టర్ ఎస్. రాజు, సిబ్బంది పాల్గొన్నారు.