ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారమే లక్ష్యం
ప్రజాదివాస్లో జిల్లా ఎస్పీ
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూలై 6 (విజయక్రాంతి): ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపడమే ప్రజాదీవస్ లక్ష్యమని భూపాలపల్లి జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్త్ అన్నారు. భూపాలపల్లి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ ప్రజాదివాస్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పిర్యాదుదారుల నుండి మొత్తం 16 ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ సూచనలు చేశారు. ఫిర్యాదులపై వెంటనే స్పందిస్తూ, సంబంధిత పోలీస్ స్టేషన్ల సిఐలు, ఎస్‌ఐలతో నేరుగా మాట్లాడి, సమస్యల పరిష్కారానికి అవసరమైన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా, నిర్భయంగా పోలీస్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. చట్టబద్ధమైన విధానంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుందని, శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు మరింత చేరువగా ఉండడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రతి సోమవారం ప్రజాదివాస్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, సంబంధిత అధికారుల సహకారంతో వాటిని పరిష్కరిస్తున్నామని, ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు.






