31 July, 2026 | 12:53 AM

మౌలిక వసతుల కల్పన, గ్రామాల అభివృద్ధే లక్ష్యం

31-07-2026 12:00 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

కడ్తాల్ / తలకొండపల్లి, జులై 30(విజయక్రాంతి): ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రా మీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. గురువారం కడ్తాల్, మండల కేం ద్రంలోని రైతువేదికలో, తలకొండపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని అధికారులకు, ప్రజాప్రతినిధులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆయా మండలాల్లో ప్రధానంగా  తాగునీరు, రహదారులు, విద్యుత్, పారిశుధ్యం తదితర మౌలిక వసతుల కల్పనలో నాణ్యతకు పెద్దపీట వేయాలని, ప్రజా సమస్యలను క్షేత్రస్థాయికి వెళ్లి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలే రాష్ట్ర ప్రగతికి పునాదులని, ఎలాంటి రాజకీయాలకు తావులేకుండా మండలంలోని ప్రతి గ్రామాన్ని దశలవారీగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా విస్తృత అవగాహన కల్పించాలని, డ్రగ్స్ కట్టడికి అన్ని శాఖలు సమన్వయంతో నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నిర్లక్ష్యం వహించే వారిని సహించేది లేదని, సమావేశాలకు గైర్హాజరైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అండర్ డ్రైనేజీ, లింక్ రోడ్లు, రవాణా సౌకర్యాల కొరతపై పలువురు సర్పంచులు ఎమ్మెల్యేకు వినతులు సమర్పించారు.సమావేశాల్లో ఎంపీడీఓ సుజాత, ఏఎంసీ చైర్పర్సన్ యాట గీత,వైస్ చైర్మన్ భాస్కర్ రెడ్డి,పీఏసీఎస్ చైర్మన్ గంప వెంకటేష్, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, మండల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.