అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యం
- 38 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
- ఓటరు జాబితా సవరణ, మున్సిపల్ భవన నిర్మాణాన్ని సమీక్ష
- నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి
నర్సాపూర్, జూలై 20 : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేయడమే తమ లక్ష్యమని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి అన్నారు. సోమవారం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీ సాయి కృష్ణా గార్డెన్స్లో నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన 80 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన రూ.38 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనారోగ్యం, ప్రమాదాలు వంటి పరిస్థితుల్లో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు సీఎం సహాయ నిధి గొప్ప భరోసాగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా నిరంతరం కృషి చేస్తామని అన్నారు. అనంతరం నర్సాపూర్ పట్టణంలోని 5వ వార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, అభివృద్ధి పనులను వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా నర్సాపూర్ 1వ వార్డులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను సమీక్షించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని నాయకులు, సంబంధిత అధికారులకు సూచించారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు కావడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో అవసరమని అన్నారు.
అనంతరం మున్సిపల్ నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించారు. భవనములో ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలు పనుల్లో పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాజు లక్ష్మీయాదవ్, వైస్ చైర్మన్ బుచ్చేష్ యాదవ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం, కౌన్సిలర్లు, నిరంజన్, శ్రీకాంత్, పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అధికారులు, సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






