కరీంనగర్ నగరాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఏప్రిల్ 21 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే మా ప్రధాన లక్ష్యం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మంగళవారం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ ప్రఫుల్ దేశాయ్, సుడా చైర్మన్ నరెంధర్ రెడ్డి, స్థానిక కార్పోరేటర్లు పర్వతం మల్లేషం, సుధగోని మాధవి కృష్ణ గౌడ్, పలువురు పాలకవర్గ సభ్యులతో కలిసి కేంద్ర ప్రభుత్వ అమృత్ 2.0 పథకంలో 1.98 కోట్ల రూపాయల నిధులతో రేకుర్తి చెరవు సుందరీకరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ భూమీ పూజ చేశారు. ఈ సంధర్బంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.... నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే పర్యటక ప్రాంతాలుగా చెరువులను తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
నగరానికి ఆనుకోని ఉన్న మూడు చెరువులను సుంధరీకరించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నుండి 5.82 లక్షల నిధులను విడుదల చేశామన్నారు. ఇందులో బాగంగా 1.98 కోట్ల రూపాయల నిధులతో రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు భూమి పూజ చేశామన్నారు. నగర ప్రజలు పర్యాటక ప్రాంతంకు వచ్చి సేదతీరే విధంగా హంగు ఆర్బాటాలతో అన్ని రకాల వసతి సౌకర్యాలతో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. గతంలోనే స్మార్ట్ సిటీ నిధులతో నగరంలోని అన్ని పార్కులను అహ్లాదకరంగా అభివృద్ధి చేశామని... శివారు ప్రాంతాల్లో ఉన్న మూడు చెరువులను పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. నగరపాలక సంస్థ పరిదిలోని శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల డివిజన్లతో సహా నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో రోడ్లు నిర్మాణం చేపట్టి, డ్రైనేజీ వ్యవస్థ ను మెరుగు పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ పాలకవర్గ సభ్యులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు






