జైనథ్‌లో రోడ్డెక్కిన అన్నదాతలు
ఆదిలాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): శనగ పంట కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. మంగళవారం జైనథ్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. శనగలను రోడ్డు పై పోసి నిరసన తెలిపారు. రైతుల నిరసనకు అఖిలపక్ష నేతలు సంఘీబావం పలికి ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, మార్కెట్ అధికారులు రైతులను సముదాయించినా వినకపోవడంతో వారిని బల వంతంగా అరెస్టు చేసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఈ సందర్భంగా అఖిల పక్షనేత లింగారెడ్డి మాట్లాడుతూ రైతుల ఇండ్లల్లో పంటను నిలువచేనేందుకు స్థలం లేక ఇబ్బందులు పడుతుంటే.. ఈనెల 30 వరకు కొనుగోళ్లు చేస్తామని అధికారులు ప్రకటించినప్పటికీ, కొనుగోళ్ల కోటా పరిమితి ముగిసిందని అధికారులు చేతెలెత్తేయడం సిగ్గు చేటన్నారు. ఐదు రోజుల్లో కొనుగోళ్లను పూర్తి స్థాయిలో చేపట్టకపోతే ఆందోళనను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో అఖిలపక్ష నేతలు మార్శెట్టి గోవర్ధన్, అశోక్ రెడ్డి, పిడుగు స్వామి యాదవ్, దేవ న్న, వెంకట్ రెడ్డి, గణేష్ యాదవ్, నితీన్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.






